మారేడ్‌పల్లి, జూలై 16 : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను పురస్కరించుకొని రెజిమెంటల్‌బజార్‌లోని ఆలయాలు ముస్తాబయ్యాయి. నిర్వాహకులు అమ్మవారి ఆలయాలను విద్యుత్ కాంతులతో సర్వాంగసుందరంగా అలంకరించారు. రెండు సంవత్సరాల నుంచి కరోనా కారణంగా బోనాల ఉత్సవాలను నామా మాత్రంగానే జరిగిన నేపథ్యంలో ఈ సారి అత్యంత వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. మోండా డివిజన్ పరిధి రెజిమెంటల్‌బజార్‌లోని గండి మైసమ్మ, జూలమ్మ, శ్రీ రేణుకా ఎల్లమ్మ, నల్లపోచమ్మ ఆలయం, సెకండ్‌బజార్‌లో ముత్యాలమ్మ, కుమ్మరిగూడలోని నల్లపోచమ్మ ఆలయం, ఆదయ్యనగర్, సాంబమూర్తినగర్, మోండా మార్కెట్లోని పలు ఆలయాల్లో బోనాల ఉత్సవాలు జరుగనున్నాయి. జాతర రెండు రోజుల ముందు నుంచే ఆలయాల వద్ద భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
రేపు భవిష్యవాణి… బోనాల ఉత్సవాలు ముగిసిన అనంతరం ఆలయాల్లో భవిష్యవాణి వినిపించనుంది. అదేవిధంగా నేడు, రేపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో నడిచే ఆర్టీసీ బస్సులు, పలు వాహనాలను అధికారులు ఇప్పటికే దారి మళ్లించినట్లు ప్రకటించారు. ముఖ్యంగా సంగీత్ చౌరస్తా నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, క్లాక్‌టవర్ నుంచి రైల్వే స్టేషన్ వచ్చే వాహనాలను ఆయా ప్రాంతాల నుంచి దారి మళ్లించారు.
ఆదయ్యనగర్, టకార బస్తీలో పండగ వాతావారణం..
మోండా డివిజన్ ఆదయ్యనగర్‌లో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నివాసం, టకార బస్తీలో డిప్యూటీ స్పీకర్ టి. పద్మారావు నివాసం ఉండడంతో ఆ ప్రాంతా ల్లో రెండు రోజుల నుంచే పండగ వాతావారణం నెలకొన్నది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చూస్తున్నారు. ఆలయాల వద్ద నార్త్ జోన్ పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.