ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 16: దేశంలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ పరిశోధన, అభివృద్ధి, మౌలిక వసతుల విభాగ అధిపతి డాక్టర్ ప్రతిష్ట పాండే అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ యూజీసీ డీన్ ప్రొఫెసర్ జి.మల్లేశం, ఐక్యూఏసీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం.శ్రీనివాస్ ఆధ్వర్యంలో “ప్రాజెక్ట్ ప్రపోజల్స్ ప్రొసీడర్స్ అండ్ ప్రాక్టీసెస్ – రోల్ ఆఫ్ ఫండింగ్ ఏజెన్సీస్” అనే అంశంపై శనివారం సదస్సు నిర్వహించారు. ఓయూలో పరిశోధనలను బలోపేతం చేసేందుకు నిర్వహించిన ఈ సదస్సుకు ఓయూ అధ్యాపకులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ప్రతిష్ట పాండే హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రాజెక్టులపై అవగాహన కల్పించారు. ఓయూలో జరుగుతున్న పరిశోధనల పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. పరిశోధనల్లో ముందడుగు వేయడంతో పాటు మూడో విడత నిధులను వినియోగించుకున్న అతి కొద్ది వర్సిటీలలో ఓయూ ఒకటని గుర్తు చేశారు. అత్యధిక పీహెచ్డీలతో పాటు 4.27 లక్షల పరిశోధనా పబ్లికేషన్స్తో ప్రపంచ ర్యాంకింగ్స్లో మూడో స్థానంలో మన దేశం నిల్చిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ డీన్ ప్రొఫెసర్ బాలకిషన్, వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్, డీన్లు, ప్రొఫెసర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.