సిటీబ్యూరో, జూలై 16 (నమస్తే తెలంగాణ): నగరంలో బూస్టర్‌డోసుపై ప్రజల నుంచి స్పందన పెరుగుతున్నది. తొలిరోజే విజయవంతంగా నగరంలో 3755 మందికి బూస్టర్‌డోసు వేశారు. మొన్నటి వరకు కేవలం 60 ఏండ్లు పైబడిన వారికి మాత్రమే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో బూస్టర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 75 రోజుల పాటు 18-59 ఏండ్ల వయస్సు వారికి ఉచితంగా బూస్టర్ డోసు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులోభాగంగా శుక్రవారం బూస్టర్ డోసు ఇచ్చినట్లు హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి తెలిపారు.
ప్రతి ఒక్కరూ బూస్టర్ డోసు తీసుకోవాలి;గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
కరోనా నుంచి రక్షణకు ప్రతి ఒక్కరూ విధిగా బూస్టర్ డోసు తీసుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. శనివారం అమీర్‌పేట్ ప్రభుత్వ ఆస్పత్రిలో గవర్నర్ బూస్టర్ డోసు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా తీసుకోవడం ద్వారా తమను తాము రక్షించుకునే వీలుందన్నారు. కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ దశరథ్, ఎస్పీహెచ్వో డాక్టర్ రేవతి, సీనియర్ వైద్యాధికారి డాక్టర్ వినాయక్, వైద్యులు గిరిజ, నాగరాజు,మహేశ్, జావేద్ తదితరులు పాల్గొన్నారు.