సిటీబ్యూరో, జూలై 16(నమస్తే తెలంగాణ): స్టార్టప్ ఇండియా, ఇస్రో సంయుక్తంగా నిర్వహిస్తున్న డ్రోన్స్ స్టార్టప్ మీటప్ హైదరాబాద్ ఎడిషన్ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. శనివారం ఐటీ కారిడార్‌లోని టీ హబ్‌లో నిర్వహించిన మీటప్ కార్యక్రమంలో నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా ఉన్న 40కి పైగా డ్రోన్ సంబంధిత కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్టప్‌ల వ్యవస్థాపకులు, 150 మందికి నిపుణులు హాజరయ్యారు. దేశ వ్యాప్తంగా ఉన్న డ్రోన్ స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు స్టార్టప్ ఇండియా, ఇస్రో సంస్థలు నావిక్ గ్రాండ్ చాలెంజ్‌ను నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా సుమారు రూ.6.5 కోట్లను డ్రోన్ స్టార్టప్‌లకు సీడ్ ఫండ్‌గా ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు దేశంలోని బెంగళూరు, పూణె, చెన్నై నగరాల్లో నిర్వహించగా, శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. తర్వాత ఢిల్లీలో నిర్వహించి, మొత్తం స్టార్టప్‌లలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి వాటికి అవసరమైన సీడ్ ఫండ్‌ను అందిస్తారని స్టార్టప్ ఇండియా ప్రతినిధి శుభమ్ మంగళ, తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ హెడ్ (గవర్నమెంట్ ఇన్నోవేషన్స్ అండ్ పార్టనర్షిప్) ఎన్.ప్రణయ్ కుమార్‌లు తెలిపారు. కార్యక్రమంలో టీఎస్ఐసీ సీఐఓ శాంతా తౌటం, టీఎస్ఐసీ హెడ్ (గవర్నమెంట్ ఇన్నోవేషన్స్ అండ్ పార్టనర్షిప్) ఎన్.ప్రణయ్ కుమార్, స్టార్టప్ ఇండియా ప్రతినిధులు ఆకాంక్ష, శుభమ్ మంగళలు పాల్గొన్నారు.