సిటీబ్యూరో, జూలై 16(నమస్తే తెలంగాణ): అధికారుల అప్రమత్తతతో వానగండం గట్టెక్కింది. ‘వర్షంతో జర జాగ్రత్త.. వాహనదారులూ నెమ్మదిగా వెళ్లండి’, ‘రోడ్డు నిబంధనలు పాటించి సాఫీగా ప్రయాణించండి’, ‘అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటికెళ్లండి’ గత వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలపై నగరవాసులను ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. అంతేగాకుండా వాహనదారులను మేల్కొలిపేందుకు మహానగర వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. పలు ముందు జాగ్రత్తలతో కూడిన సూచిక బోర్డులను ఏర్పాటు చేయడంతో అధికారుల ప్రయత్నాలు ఫలించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నగరవాసులు వర్ష గండం నుంచి గట్టెక్కారు. వర్షాలు దంచి కొట్టినా కొన్ని ఎలాంటి తిప్పలు ఎదురవ్వకపోవడంతో నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు.
పనులు జరుగుతున్న ప్రాంతాల్లో..
నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పనులు జరిగే వద్ద ప్రయాణికులు, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా.. ట్రాఫిక్ రద్దీని తగ్గించాలనే ఉద్దేశంతో ముందస్తుగానే పలు సూచికల బోర్డులు ఏర్పాటు చేసి, దారి మళ్లింపు చర్యలు చేపట్టారు. అంతేగాకుండా విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
అన్ని విభాగాల సమన్వయంతో..
వారం రోజులుగా కురిసిన వర్షాలపై జీహెచ్ఎంసీ అధికారులు అన్ని విభాగాలతో సమన్వయం పని చేశారు. ప్రధానంగా ద్విచక్ర వాహనాలు వర్షానికి స్కిడ్ అయ్యే ప్రమాదముందని, హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలని ప్రకటనలు చేయడంతో వాహనదారులు సైతం జాగ్రత్తలు పాటించారు. మాన్సూన్ సమస్యలను ఎదుర్కొనేందుకు అత్యవసర బృందాలను సైతం సిద్ధం చేసి, ఎక్కడైతే సమస్య ఉత్పన్నమైందో వెంటనే అక్కడికి చేరుకొని పరిష్కరించారు. సమన్వయంతో విజయవంతంగా నగరవాసులకు చేసిన సూచనలు ఫలించాయి.