సిటీబ్యూరో, జూలై 15 (నమస్తే తెలంగాణ): లేఅవుట్‌ను అభివృద్ధి చేయకుండానే కొనుగోలుదారుల నుంచి డబ్బు లు వసూలు చేస్తున్న ఇంక్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌కు మొట్టికాయలు వేసింది కన్జ్యూమర్ ఫోరం. కమిషన్‌ను ఆశ్రయించిన ఓ కొనుగోలుదారుడికి రూ.5 లక్షలు చెల్లించాలని హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 అధ్యక్షురాలు బి.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యురాలు సి.లక్ష్మీప్రసన్నలతో కూడిన బెంచ్ ఆదేశించింది. యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలోని సర్వే నంబర్ 801/పీలో ఎలాంటి అనుమతులు లేకుండానే ఇంక్రెడిబుల్ ఇండియా సంస్థ లే అవుట్ చేసింది. ఈ విషయాన్ని లోకల్ చానళ్లల్లో ప్రచారం చేసుకుంది. ప్రకటనలు చూసి సికింద్రాబాద్‌కు చెందిన కేఎల్వీ ప్రసాద్ రెండు ప్లాట్లను కొనుగోలు చేస్తానని ఒక్కో దానికి రూ. 12వేలు చెల్లించి.. బుక్ చేసుకున్నాడు. సేల్ అగ్రిమెంట్ సమయంలో పాస్‌బుక్ నంబర్ 0868కు రూ.2,59,250, పాస్‌బుక్ నంబర్ 1415- రూ.2,59,250 చొప్పున 2017లో కట్టాడు. 2019 చివరిలో ప్లాట్లను అప్పజెప్పుతామని 2015లోనే ఒప్పందం కుదిరింది. ఎల్పీ నంబర్ లేకుండానే అప్పగించడంతో కంగుతిన్న బాధితుడు.. సంస్థ ఎండీని అనేక సార్లు సంప్రదించి.. తన డబ్బులు వాపస్ ఇవ్వాలని కోరగా, నిరాకరించడంతో వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన కమిషన్.. 2015 నుంచి ఇప్పటి వరకు బాధితుడికి రూ.5,18,500లు 9 శాతం వడ్డీతో కలిపి తిరిగి కట్టాలని, నష్టపరిహారంగా రూ.10వేలు, కోర్టు ఖర్చుల కింద రూ.5వేలు చెల్లించాలని ఇంక్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌ను ఆదేశించింది.
వితంతువైతే..బీమా డబ్బులు ఇవ్వరా..ఎల్ఐసీపై కన్జ్యూమర్ ఫోరం ఆగ్రహం
‘వివాహితన లేదా వితంతువా.. అనేది మీకు అనవసరం.. ఆ విషయం వ్యక్తిగతమైనది. వితంతువనే విషయాన్ని.. బీమా డబ్బు చెల్లించేందుకు ముడిపెడతారా?’ అంటూ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఎల్ఐసీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనల ప్రకారం నామినీకి చెల్లించాల్సిన మొత్తాన్ని అందజేయాలని కమిషన్ అధ్యక్షుడు ఎంఎస్కే జైశ్వాల్, సభ్యులు మీనా రామనాథన్‌తో కూడిన బెంచ్ ఆదేశించింది. ములుగు జిల్లా రంగారావుపల్లికి చెందిన ఫిర్యాదుదారుడు (నామినీ) దేవీసింగ్ తల్లి 2007లో జీవిత బీమా పాలసీని తీసుకున్నది. నామినీగా తన కొడుకు దేవీసింగ్ను పేర్కొన్నది. 2012లో ఆమె మృతిచెందింది. కాగా, తల్లి పాలసీ డబ్బులు చెల్లించాలని దేవీసింగ్ ఎల్ఐసీని కోరగా, సంబంధం లేని ప్రశ్నలు వేసి.. చెల్లించేందుకు నిరాకరించింది. దీంతో బాధితుడు వరంగల్ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించగా, అనుకూలంగా తీర్పువచ్చింది. అయితే ఎల్ఐసీ రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌లో అప్పీలు చేసింది. కేసు పూర్వపరాలు పరిశీలించిన అనంతరం రాష్ట్ర కమిషన్ స్పందిస్తూ.. నాలుగేండ్లు ప్రీమియం చెల్లించిన తర్వాత బెనిఫిట్స్‌ను తిరస్కరించడం పూర్తిగా అన్యాయమైనదని స్పష్టం చేసింది. లక్ష రూపాయల పాలసీ బెనిఫిట్స్.. 7.5 శాతం వడ్డీతో నామినీకి చెల్లించాలని ఆదేశించింది. కోర్టు ఖర్చుల కింద, మానసిక వేదనకు గురిచేసినందుకు రూ.10 వేలు కట్టాలని వరంగల్ జిల్లా కమిషన్ తీర్పు చెబితే.. అప్పీలుకు వచ్చినందుకు రూ.25 వేలు అదనంగా చెల్లించాలని రాష్ట్ర కమిషన్ ఎల్ఐసీని ఆదేశాలు జారీ చేసింది.