సిటీబ్యూరో, జూలై 15(నమస్తే తెలంగాణ): దేశంలో ఎక్కడా లేని విధంగా మూడు మతాలకు సంబంధించిన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆధునిక వైకుంఠ ధామాన్ని ప్రభుత్వ యంత్రాంగం నిర్మిస్తున్నది. గ్రేటర్ పరిధిలోని ఎల్బీనగర్ నియోజకవర్గం ఫతుల్లాగూడలో సుమారు ఆరు ఎకరాల స్థలంలో ముక్తిఘాట్ పేరిట అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.4.25 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పనులను దాదాపు పూర్తి కాగా, ఈ నెలాఖరులోగా ప్రారంభించేందుకు హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ సన్నాహాలు చేస్తోంది. హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన వ్యక్తుల మృతదేహాలకు అంత్యక్రియలు సాఫీగా జరిగేలా అత్యాధునిక మౌలిక వసతులను కల్పించారు. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ మార్గదర్శకాల ప్రకారం ముక్తిఘాట్‌లో 20 శాతం మాత్రమే నిర్మాణాలుంటాయి..ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ మార్గదర్శకాల ప్రకారం, మిగతాదంతా పచ్చదనమే ఉంటుందని అధికారులు తెలిపారు.
ఒక్కో మతానికి రెండెకరాల స్థలం..
అధికారులు ప్రతి మతానికి రెండు ఎకరాల చొప్పున స్థలం కేటాయించారు. వేర్వేరుగా హిందూ, ముస్లిం, క్రైస్తవ సంప్రదాయాల్లో అంత్యక్రియలు నిర్వహించుకునే నిర్మాణాలు చేపట్టారు. అస్తికలను భద్రపరుచుకునే సౌకర్యం, ఒక్కో మతానికి రెండు చొప్పున ఆరు ఫ్రీజర్లు, మృతదేహాల తరలింపునకు ప్రత్యేక వాహనాలు సమకూర్చనున్నారు. పూర్తిగా సౌర విద్యుత్ వినియోగం, ప్రత్యేకంగా సోలార్ ప్లాంట్, ఘాట్ చుట్టూ 40 అడుగుల చెట్లు కనువిందు చేయనున్నాయి. స్నానపు, విశ్రాంతి గదుల్లో నీటిని పునర్వినియోగించుకునేలా 0.2 ఎంఎల్డీ మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. సేద తీరేలా ఉద్యానం, చూడగానే ఆకట్టుకునేలా ల్యాండ్ స్కేపింగ్, అలంకరణ, పూల మొక్కలు ఏర్పాటు చేసి పరిసరాలను అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ ముక్తి ఘాట్‌కు వెళ్లేందుకు వీలుగా 40 ఫీట్ల బీటీ రోడ్ ఏర్పాటు చేస్తున్నారు.