సికింద్రాబాద్, జులై 15 : పేదవాడు సెంటీ మీటర్ జరిగి ఇల్లు కట్టుకుంటే గగ్గోలు పెట్టే కంటోన్మెంట్ అధికారులు పదేండ్ల క్రితం సుమారు 700 గజాల బోర్డు స్థలంలో అక్రమంగా ఇంటిని నిర్మించినా కనీసం ఆటువైపు కన్నెత్తి చూడలేదు. దీని వెనుక కథేంటో పెరుమాళ్లకే ఎరుక అన్న చందంగా బోర్డు అధికారుల తీరు కనిపిస్తుంది. ఓ ప్రైవేట్ బ్యాంక్ సిబ్బంది ఆ ఇంటిని జప్తు చేసే సమయంలో బోర్డు స్థలంలో ఇంటిని నిర్మించారంటూ బోర్డు అధికారులు వచ్చి ఆ ఇంటిని సీజ్ చేశారు.
వివరాలు.. కంటోన్మెంట్ పరిధిలోని ఆరోవార్డు టెంపుల్రాక్ ఎన్‌క్లేవ్‌లోని ఓ ఇంటిని ఖాళీ చేయించే క్రమంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సుమారు 700 గజాలస్థలంలో పురుషోత్తంరెడ్డి అనే వ్యక్తి పదేండ్ల క్రితమే ఇంటిని నిర్మించారు. ఇంటిని వేరే వ్యక్తికి విక్రయించగా సదరు వ్యక్తి ఓ ప్రైవేటు బ్యాంకు నుంచి లోను తీసుకున్నాడు. సకాలంలో లోను చెల్లించని కారణంగా బ్యాంకు అధికారులు ఆ ఇంటిని వేలం వేసి విక్రయించారు. ఈ తరుణంలో ఇంటిని స్వాధీనం చేసుకునే క్రమంలో రెండున్నరేండ్లుగా బ్యాంకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మూడు నెలల క్రితమే బ్యాంకు అధికారులు స్వాధీనానికి యత్నించగా పురుషోత్తంరెడ్డి కుటుంబ సభ్యులు వారిని అడ్డుకొన్నారు. ఈ క్రమంలో బ్యాంకు అధికారులు కోర్టును ఆశ్రయించి, పోలీసుల రక్షణతో ఇళ్లు ఖాళీ చేయించేందుకు శుక్రవారం వచ్చారు. ఈ సమయంలోనూ పురుషోత్తంరెడ్డి కుటుంబ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు నచ్చజెప్పి ఇళ్లు ఖాళీ చేయించారు. ఇదంతా బాగానే ఉన్నా సడన్‌గా విషయం తెలుసుకున్న కంటోన్మెంట్ బోర్డు అధికారులు సంబంధిత భవనం బోర్డు స్థలంలో అక్రమంగా నిర్మించారని పేర్కొంటూ సీజ్ చేశారు. దీంతో ఏమి చేయాలో తోచక బ్యాంక్ అధికారులు మరోసారి కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది.