జవహర్‌నగర్, జూలై 15: మానవ మనుగడకు చెట్లు ప్రాణ వాయువని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని జిల్లా అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్ అన్నారు. శుక్రవారం కార్పొరేషన్లో 8వ విడుత హరితహారంలో భాగంగా 17వ డివిజన్ శాంతినగర్‌లో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ఉద్యమంలా సాగుతుందన్నారు. చెట్లు లేకుంటే మానవ జీవితం లేదని, మొక్కలు నాటి సంరక్షిస్తేనే అవి మనల్ని రక్షిస్తాయన్నారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలు నాటి సంరక్షించాలని మేయర్ మేకల కావ్య కోరారు. కార్యక్రమంలో కమిషనర్ జ్యోతిరెడ్డి, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్, కార్పొరేటర్లు లలితాయాదవ్, శాంతికోటేశ్ గౌడ్, శ్రీకాంత్, నాయకులు సాధిక్, శ్రీనాథ్, పౌలు, మున్సిపల్ మేనేజర్ నగేశ్, కాలనీవాసులు పాల్గొన్నారు.
తిమ్మాయిపల్లిలో మొక్కలు పంపిణీ ..
మండలంలోని తిమ్మాయిపల్లి, యాద్గార్‌పల్లిలో హరితహారం మొక్కలు పంపిణీ చేయ గా, యాద్గార్‌పల్లిలో మొక్కలు నాటేందుకు సిబ్బంది గుంతలు తీసే కార్యక్రమాన్ని చేపట్టారు. హరితహారంలో భాగంగా గ్రామాల్లో 100 శాతం టార్గెట్‌ను పూర్తి చేయాలన్న సంకల్పంతో పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించారు.
కీసర చంద్రగిరి కాలనీలో..
కీసర మండల కేంద్రంలోని చంద్రగిరి కాలనీలో శుక్రవారం సర్పంచ్ నాయకపు మాధురి వెంకటేశ్, ఆ కాలనీవాసులు హరితహారం మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం గ్రామంలోని ప్రతి కాలనీలో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించారు. కార్యక్రమంలో చంద్రగిరి కాలనీ అధ్యక్షుడు శ్రీనాథ్‌రెడ్డి, నాయకులు హనుమంత్‌రెడ్డి, కీసరగుట్ట ట్రస్టు బోర్డు మెంబర్లు శ్రావన్కుమార్గుప్త, అంజయ్యగౌడ్, నాయకులు సురేందర్ పాల్గొన్నారు.
నాగారం మున్సిపల్ 8వ వార్డులో..
నాగారం మున్సిపల్ పరిధి 8వ వార్డులోని పలు కాలనీల్లో ప్రజలకు పూలు, పండ్ల మొక్కలను కౌన్సిలర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. అనంతరం వివిధ కాలనీల్లో పర్యటించి భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు , మురుగు కాలువలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేత కౌకుట్ల కృష్ణారెడ్డి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, మహిళలు, పాల్గొన్నారు.
మొక్కలతోనే సమాజ మనుగడ
మొక్కలతోనే సమాజ మనుగడ సాధ్యం అవుతుందని ఘట్కేసర్ మునిపాలిటీ 3వ వార్డు కౌన్సిలర్ బొక్క సంగీత ప్రభాకర్ రెడ్డి తెలిపారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా వార్డులో మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు.ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు.