మియాపూర్, జూలై 15 : దళితులను అన్ని రకాలుగా పురోగతి దిశగా నడిపించేలా సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. దళితుల అభ్యున్నతే ధ్యేయంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ద్వారా మంజూరైన యూనిట్లను విజయవంతంగా నిర్వహించి తోటి లబ్ధిదారులకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. దళితబంధు పథకం కింద మియాపూర్ డివిజన్ చింరజీవినగర్కు చెందిన రమేశ్, కొండాపూర్ డివిజన్ ప్రేమ్‌నగర్‌కు చెందిన సంతోష్‌కు మంజూరైన కార్లను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌తో కలిసి విప్ గాంధీ శుక్రవారం తన నివాసంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. దళితబంధు పథకాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. ఎంచుకున్న రంగాలను సమర్థంగా నిర్వహించుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నారు. తమ జీవితాలలో వెలుగులు నింపుకునేలా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని విప్ గాంధీ కోరారు. తొలి దశలో నియోజకవర్గంలో 100 మందిని ఎంపిక చేసి లబ్ధిని కల్పిస్తున్నట్లు, దశల వారీగా పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు రాజునాయక్, వాలా హరీష్‌రావు, శ్రీనివాస్, నర్సింహారావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.