మూసాపేట, జూలై15: కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో నెలకొన్న సమస్యలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. శుక్రవారం మూసాపేట డివిజన్లోని మోతినగర్, బబ్బుగూడ పశువుల సంతను డివిజన్ మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్‌కుమార్, అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నివాస ప్రాంతాల్లో పశువుల సంత ఉండటం వల్ల స్థానికులు దోమలు, రాత్రి వేళల్లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారని అయితే కొంతమంది అభివృద్ధి ఓర్వలేక న్యాయస్థానం నుంచి స్టే తేవడం వల్ల అభివృద్ధి ఆగిపోయిందన్నారు. ఈ స్థలాన్ని జీహెచ్ఎంసీ వారికి అప్పగిస్తే ఆ స్థలంలో స్థానికులకు ఉపయోగపడే పోలీస్‌స్టేషన్, పాఠశాలను ఏర్పాటు చేసుకునే విధంగా కృషి చేస్తానన్నారు. పశువుల సంత కోసం శివారు ప్రాంతంలో 10ఎకరాల స్థలం ఇప్పించేందుకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ పద్మహర్ష, ఇఫ్తకార్ ఆయూబ్, మార్కెటింగ్ సెక్రటరీ చంద్రశేఖర్, ఏసీపీ గంగారాం పాల్గొన్నారు.