బేగంపేట్ జూలై 14: వరుణ దేవుడు శాంతించి, తన ఉధృతి తగ్గించి వర్షాలు తగ్గు ముఖం పట్టేలా చూడాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉజ్జయినీ మహంకాళిని కోరారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గురువారం వరుణ శాంతి హోమం నిర్వహించి మంత్రి తలసాని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఈ నెల 17వ తేదీన మహంకాళి బోనాల సందర్భంగా అమ్మవారికి సమర్పించనున్న చీర తయారీ పనులను మగ్గంపై మంత్రి ప్రారంభించారు.
ఆలయాల నిర్వాహకులకు చెక్కుల పంపిణీ
బోనాల వేడుక నిమిత్తం సికింద్రాబాద్ పరిధిలోని 91 దేవాలయాల నిర్వాహకులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్ధిక సాయం చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో నదులు, చెరువులు పూర్తిగా నిండిపోయాయని తెలిపారు. గోదావరి నది గతంలో ఎన్నడూ లేని విధంగా ఉప్పొంగి ప్రవహిస్తున్నదని పేర్కొన్నారు. వరుణ దేవుడు శాంతించాలని హోమం నిర్వహించినట్టు తెలిపారు. సికింద్రాబాద్‌లో బోనాలు నిర్వహించనున్న నేపథ్యంలో 91 దేవాలయాలకు గాను 76 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ నెల 24న బోనాలు నిర్వహించనున్న హైదరాబాద్ పరిధిలోని దేవాలయాలకు 18న చెక్కులు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఆలయానికి రెండు ప్రధాన రహదారుల్లో నిర్మించిన ఆర్చి గేట్లను ఈ నెల 15న ప్రారంభించనున్నట్టు ఆయన వెల్లడించారు. ఆలయ పరిసరాల్లో జరుగుతున్న పనులను వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, కార్పొరేటర్లు, వివిధ దేవాలయాల ఈవోలు, జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు పాల్గొన్నారు.