కందుకూరు, జూన్ 11: కందుకూరు మండల కేంద్రలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న వారాంతపు సంతకు విశేష స్పందన లభిస్తున్నది. తాజా కూరగాయలు, ఆకుకూరలు ఇక్కడ లభిస్తుండటంతో స్థానికులే కాకుండా చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఇక్కడకు చేరుకొని కొనుగోలు చేస్తున్నారు. అంతే కాకుండా ఈ సంతలో వ్యవసాయ పనిముట్లు తక్కువ ధరకే లభిస్తున్నాయి. అయితే రోజురోజుకూ అధరణ పెరుగుతున్న ఈ సంతలో కనీస వసతులు కరువవడంతో వ్యాపారులు, కొనుగోలు దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రోడ్డుపైనే కొనసాగుతున్న ఈ సంతలో వ్యాపారులు, కొనుగోలుదారులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన జడ్పీటీసీ జంగారెడ్డి, మార్కెట్ చైర్పర్సన్ వరలక్ష్మీసురేందర్రెడ్డి, ఎంపీటీసీ రాజశేఖర్రెడ్డి, మన్నే జయేందర్ ముదిరాజ్ ఈ విషయాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి వసతుల కల్పనకు రూ.20లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో పోలీస్ స్టేషన్ పక్కన చకచకా మార్కెట్ యార్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మార్కెట్ యార్డు త్వరలోనే అందుబాటులోకి రానుండటంతో వ్యాపారస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తీరనున్న వ్యాపారుల కష్టాలు..
ప్రతి ఆదివారం వ్యాపారస్తులు ఎండలో ఎండుతూ.. వానలో తడుస్తూ.. వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని గుర్తించి మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా నిధులు మంజూరు చేశారు. పనులు చురుకుగా కొనసాగుతున్నాయి.
– సురుసాని రాజశేఖర్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కందుకూరు
రూ.20లక్షలతో..
మండల కేంద్రంలో రూ.20లక్షలతో మార్కెట్ యార్డు నిర్మిస్తున్నాం. గతంలో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో ఇబ్బందులు తప్పనున్నాయి. పనులు చకచకా సాగుతున్నాయి.
– బొక్క జంగారెడ్డి, జడ్పీటీసీ కందుకూరు