సిటీబ్యూరో, జూలై 4 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో నిరవధికంగా కురుస్తున్న వానలతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు, జ్వరం తదితర లక్షణాలతో నగరంలోని అన్ని ఆరోగ్య కేంద్రాలలో ఓపీ సంఖ్య పెరుగుతోంది. సోమవారం ఒక్కరోజే ఫీవర్ హాస్పిటల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపీ రోగుల సంఖ్య 300దాటింది. మొన్నటి వరకు ఇక్కడ ఓపీ 200 నుంచి 250 మధ్య నమోదయ్యేదని దవాఖాన వర్గాలు తెలిపాయి. అదేవిధంగా మూడునాలుగు రోజులుగా అన్ని బస్తీ దవాఖానల్లో ఓపీ సంఖ్య 15 నుంచి 20 శాతం పెరిగినట్లు వైద్యాధికారులు తెలిపారు.
వీటితో పాటు ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, యూపీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు తదితర అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ఓపీ రోగుల సంఖ్య 10 నుంచి 12శాతం పెరిగినట్లు అధికారులు తెలిపారు. వర్షాలు కురిసిన తరువాత ఉష్ణోగ్రతలు పెరిగితే వాతావరణంలో ఏర్పడే మార్పులకు తోడు దోమల విజృంభణ కూడా పెరుగుతుంది. దోమలు వృద్ధి పెరిగి, డెంగీ, చికున్‌గున్యా వంటి జ్వరాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అధికారులు తెలిపారు. డెంగీని పరిశీలిస్తే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వైరస్‌లో స్ట్రైయిన్ మారుతుందని, ఈ క్రమంలో ఈసారి డెంగీ కేసులు కొంత ఆందోళన కలిగించే అవకాశాలు లేకపోలేదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
90శాతం సాధారణ జలుబు, జ్వరమే..
వరుసగా కురుస్తున్న వానల వల్ల వాతావరణం మారింది. ఎక్కువగా జలుబు, దగ్గు, జ్వరం వంటి కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో 90శాతం సాధారణ జలుబు, జ్వర మే కనిపిస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా జలుబు, జ్వరానికి గురవుతున్నారు. నగరంలోని అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో సీజనల్‌కు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. డెంగీ కేసులు పెద్దగా లేవు. రానున్న రోజుల్లో పెరిగే అవకాశాలు ఉన్నాయి.
– డాక్టర్ జె.వెంకటి, హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి