సిటీబ్యూరో, జూలై 10 (నమస్తే తెలంగాణ) : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మరింత అప్రమత్తంగా ఉండేలా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చర్యలు చేపట్టింది. ముఖ్యంగా విద్యుత్ వినియోగదారులను అప్రమత్తం చేస్తూ వారి ఫోన్లకు సందేశాలను పంపుతున్నారు. అదేవిధంగా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వినియోగదారులకు సూచనలు చేస్తూ ప్రమాదాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. వర్షా కాలంలో మానవ తప్పిదాలతోనే విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో నిరంతరం అప్రమత్తతే చాలా కీలకమని వినియోగదారులు గుర్తించాలని అధికారులు తెలిపారు.
9 సర్కిళ్ల పరిధిలో కంట్రోల్ రూమ్లు..
గ్రేటర్ పరిధిలోని 9 సర్కిళ్లలోనూ విద్యుత్ శాఖ ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. 15మంది నైపుణ్యం కలిగిన సిబ్బందితో కూడిన డివిజన్ స్థాయి డిజాస్టర్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు నిరంతరం విద్యుత్ సరఫరాను పర్యవేక్షిస్తూ కంట్రోల్ రూమ్ నుంచి వచ్చే ఆదేశాలననుసరించి పనిచేస్తాయని అధికారులు తెలిపారు. వాతావరణంలో జరిగే మార్పులను నిరంతరం గమనిస్తూ ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలోని సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తూ, నిత్యం అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సర్కిల్ ఎస్ఈలకు ఉన్నతాధికారులు సూచనలు చేశారు.