మేడ్చల్, జూలై10(నమస్తే తెలంగాణ): భారీ వర్షాల నేపథ్యంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ హరీశ్ తెలిపారు. ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు అధికారులందరూ అందుబాటులో ఉండే విధంగా కలెక్టరేట్లో 24 గంటల పాటు కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామాల్లో సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండేలా అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ హరీశ్ స్పష్టం చేశారు.
నేటి ప్రజావాణి రద్దు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా ప్రజావాణి నిర్వహించనందున కలెక్టరేట్‌కు ప్రజలు రావద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.