ఖైరతాబాద్, జూలై 10: స్టూవర్టుపురం దొంగలు మరోసారి వెలుగులోకి వచ్చారు. ఈ నెల 4న ద్విచక్రవాహనంలో పెట్టిన బంగారు ఆభరణాలు, వస్తువులు తస్కరించిన దొంగలు స్టూవర్టుపురానికి చెందిన వారిగా పంజాగుట్ట పోలీసులు గుర్తించారు. ఆదివారం వారిని అరెస్టు చేసి సొత్తును రికవరీ చేశారు. ఏసీపీ గణేశ్, డీఐ నరసింహరాజు వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్‌లోని ఈస్ట్‌మారెడ్‌పల్లికి చెందిన పుష్పా గోల్డ్ అండ్ డైమండ్స్ సేల్స్ మేనేజర్ నికేత్ కొటారీ ఈనెల 4న అమీర్‌పేట్‌లోని ఆధిత్య జూవెల్లర్స్ నుంచి డైమండ్ నెక్లెస్, పూజా జూవెల్లరీస్ నుంచి ఐదు బంగారు వాచీలును తమ వ్యాపార లావాదేవీల్లో భాగంగా తీసుకువచ్చేందుకు తమ సంస్థ ఉద్యోగి అయిన భరత్ దేవాసిని పంపించాడు. వాటిలో డైమండ్ నెక్లెస్‌ను అబిడ్స్‌లోని డయాజెమ్స్ షాపులో డెలివరీ చేయాలని భరత్‌కు సూచించాడు. అయితే వాటిని స్కూటర్ డిక్కీలో పెట్టుకొని బయలుదేరిన భరత్ అబిడ్స్ మెరీడియన్ ప్లాజా వద్దకు రాగానే మూత్రవిసర్జన కోసం వాష్‌రూమ్‌కు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి స్కూటర్లో ఉన్న డైమండ్ నెక్లెస్, ఐదు బంగారు వాచీలు కనిపించలేదు. దీంతో మేనేజర్ నికేత్ కొటారీకి సమాచారం అందించగా వెంటనే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
డైమండ్ నెక్లెస్, బంగారు వాచీల తస్కరణపై పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీలు, సెల్‌ఫోన్ సిగ్నల్ ద్వారా నిందితులు ఏపీ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా చెర్ల మండలం, స్టూవర్టుపురం గ్రామంలో ఉన్నట్లు గుర్తించారు. పంజాగుట్ట పీఎస్ నుంచి ప్రత్యేక బృందాలు అక్కడికి వెళ్లి మనుపాటి దుర్గా ప్రసాద్ (40), ఇట్టా హరికృష్ణ (45)లను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరూ స్టూవర్టుపురం ప్రొఫెషనల్ దొంగలుగా దర్యాప్తులో తేలింది. దొంగతనాల కోసం హైదరాబాద్‌కు వచ్చిన వారు పక్కా ప్లాన్ ప్రకారమే ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.9లక్షల విలువైన డైమండ్ నెక్లెస్‌ను స్వాధీనం చేసుకున్నారు. మిగతా ఐదు బంగారం వాచీలను కరిగించి సొమ్ము చేసుకున్నట్లు తెలిసింది.