రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నగర యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని పటిష్ట చర్యలు చేపట్టారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కురుస్తున్న వర్షాలతో వరద తీవ్రతను అంచనా వేస్తూ ముంపు లేకుండా చూస్తున్నారు. మొబైల్, మినీ మొబైల్, స్టాటికల్, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్లను ఏర్పాటు చేసి, నీరు నిలిచిన ప్రాంతాలను గుర్తిస్తూ వెంటవెంటనే తోడేస్తున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరిస్తున్నామని అధికారులు తెలిపారు.
ఇప్పటి వరకు 383 ఫిర్యాదులు అందగా.. అక్కడికక్కడే 375 సమస్యలను పరిష్కరించామని వివరించారు. అంతేకాక 197 చెరువుల వద్ద అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. చెరువుల్లో చేరే వరదను అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని.. అత్యవసర పరిస్థితులు తలెత్తితే గేట్లు ఎత్తి వరదను దిగువకు పంపేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించామన్నారు. మరోవైపు ఎస్ఎన్డీపీ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉంటే శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పర్యటించారు. వర్ష తీవ్రతను అంచనా వేస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు. పౌరులు ఫిర్యాదు చేయాలనుకుంటే 040-21111111, 040-29555500 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
– సిటీబ్యూరో, జూలై 9 (నమస్తే తెలంగాణ)