సిటీబ్యూరో, జూలై 9 (నమస్తే తెలంగాణ): ఆహ్లాదకరమైన వాతావరణం.. ఎటుచూసినా ప్రపంచానికి జ్ఞానం నేర్పిన మహోన్నతుల విగ్రహాలు.. వారి బోధనలు.. మహిళా స్వయం సమృద్ధితో పాటు సామాజిక మార్పే లక్ష్యంగా తెల్లాపూర్ మహాత్మాపూలే కాలనీలోని అమృతసత్తయ్య కొల్లూరి ఎడ్యుకేషన్ సొసైటీ (ఆస్క్స్) ముందుకు సాగుతున్నది. గత సంవత్సరం జనవరి 26న ప్రారంభమైన ‘ఫూలే-అంబేద్కర్ సెంటర్ ఫర్ ఫిలసాఫికల్ అండ్ ఇంగ్లిష్ ట్రైనింగ్’ సామాజిక న్యాయం, మహిళల స్థిరమైన అభివృద్ధి ప్రధానాంశాలుగా తన సేవలను కొనసాగిస్తున్నది. ఇప్పటికే రెండు బ్యాచ్‌ల్లో 80 విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ఈ సంస్థ మూడో బ్యాచ్‌లో డాటా సైన్స్‌పై తర్ఫీదు ఇస్తున్నది.
తరగతులు, వసతుల కోసం ప్రత్యేక గదులు..
కార్మిక ఉద్యమ నేపథ్యం కలిగిన సత్తయ్య, పే బ్యాక్ టు ద సొసైటీ ఆలోచనతో సంస్థను ముందుకు నడుపుతూ విద్యార్థులకు కావాల్సిన సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. విద్యాకేంద్రంలో 17 గదులు నిర్మించారు. ఒక్కో గదిలో నలుగురు ఉండొచ్చు. తరగతుల కోసం ప్రత్యేకంగా రూంలు ఏర్పాటు చేశారు. కొత్తగా తాటి దూలాలతో లైబ్రరీని నిర్మించారు. ఇక్కడ మూడు వేల పుస్తకాలు ఉన్నాయి. అంతేకాక కంప్యూటర్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. గ్రంథాలయం వెనుక 40 మంది వీక్షించేలా ఓపెన్ థియేటర్ నిర్మించారు. విద్యార్థులకు వైద్యం అందించేందుకు ప్రాథమిక వైద్యశాలను సైతం ఏర్పాటు చేశారు.
ఒత్తిడి తగ్గించేందుకు..
శిక్షణ తీసుకునే విద్యార్థుల కోసం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ క్రమంలో ఒత్తిడి గురికాకుండా వ్యాయామశాలను నిర్మించారు. ఇందులో వివిధ పరికరాలను ఏర్పాటు చేశారు. ఈ జిమ్‌కు ప్రముఖ అథ్లెటిక్ కేడీ జాదవ్ పేరు పెట్టారు. మన దేశం నుంచి మొట్టమొదటి సారిగా ఒలింపిక్స్‌లో పాల్గొన్న జాదవ్ విజేతగా నిలిచి దేశ ఖ్యాతిని ఖండఖండాంతరాలకు తెలియజేశారు.
ప్రత్యేక మెనూ..
ఈ కేంద్రంలో మెనూ సైతం ప్రత్యేకమే. ఉదయం 5.30 గంటల నుంచి 6.30 వరకు యోగా చేయిస్తారు. 7.30 నుంచి 8.30 వరకు త్రుణధాన్యాలతో కూడిన టిఫిన్, రెండు ఎగ్స్ ఇస్తారు. మధ్యాహ్నం భోజనం. సాయం త్రం 5 గంటలకు గుడాలు, మిల్లెట్ గంజి, రాగిజావ, సీజనల్ ఫ్రూట్స్ అందజేస్తారు. డిన్నర్లో కర్రీ, సాంబార్, సల్ల ఉంటుంది. ఆదివారం మటన్, బుధవారం చికెన్ వండుతారు. విద్యార్థుల్లో పోషకాహార లోపం రాకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు విద్యా కేంద్రం అధ్యక్షుడు కొల్లూరి సత్తయ్య, కార్యదర్శి భరత్‌కుమార్, సెంటర్ డైరెక్టర్ సుదర్శన్, కో ఆర్డినేటర్లు మణికంఠ, నైనాల సతీశ్ తెలిపారు.
విద్యార్థుల ఎంపిక..
మహిళలకు మొదటి ప్రాధాన్యం. ఆర్థిక, సామాజిక వెనుకబాటుతో పాటు విద్యార్థుల తల్లిదండ్రుల వృత్తి, ఆర్థిక స్థితిని సైతం పరిగణలోకి తీసుకుంటారు. మూడు నెలలకోసారి దేశవ్యాప్తంగా నోటిఫికేషన్ జారీ చేస్తారు. అయితే మొదటి బ్యాచ్ విద్యార్థులకు కేంద్రియ విద్యాలయాల్లో నిర్వహించే పీజీసీయూసెట్(ప్రవేశ పరీక్ష) కోసం నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చారు.
సత్యశోధక్ సమాజ్ స్ఫూర్తి: విద్యా కేంద్రం అధ్యక్షుడు సత్తయ్య
ఫూలే దంపతులు సత్యశోధక్ సమాజ్, అంబేద్కర్ పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఏర్పాటు చేసి చదువుల వెలుగును అందించారు. అదేస్ఫూర్తి నన్ను నడిపిస్తున్నది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో పని చేస్తున్న నేను నాకున్న స్థలంలో కొంత శిక్షణ కేంద్రానికి కేటాయించా. విద్యార్థులకు భోజనం, ఇతర ఖర్చులు భరిస్తున్నా. ఆదాయంలో కొంత భాగం కుటుంబానికి, రెండో భాగం భవిష్యత్తు అవసరాలకు, మూడోభాగం సమాజంలోని పేదవర్గాలకు కేటాయించి నా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నా.
ఉచితంగానే అన్ని సౌకర్యాలు: స్వాతిరెడ్డి, విద్యార్థి
ఈ విద్యాకేంద్రంలో అన్ని వసతులు ఉచితమే. అత్యుత్తమ ఆహారం, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, చదువాలనే ధ్యాస పుట్టించే మంచి వాతావరణం ఉన్నాయి. నిన్ను నీవు తీర్చుదిద్దుకోవాలంటే ఫూలే అంబేద్కర్ సెంటర్ ఫర్ ఫిలసాఫికల్ అండ్ ఇంగ్లిష్ ట్రైనింగ్ (ప్యాక్పెట్)కు రావాల్సిందే. ఆ విద్యాకేంద్రంలోకి అడుగు పెడితే సగం పని పూర్తిఅయినట్టే..
ప్రాపంచిక దృక్పథం తెలిసింది: మనోరంజన్దాస్, జబల్పూర్, ఒడిస్సా
ప్రాపంచిక దృక్పథం అంటే ఏమిటో ఫూలే అం బేద్కర్ సెంటర్ ఫర్ ఫిలసాఫికల్ అండ్ ఇంగ్లిష్ ట్రైనింగ్ ద్వారా తెలుసుకున్నా. ఎంతో నైపుణ్యంతో కూడిన విషయాలను బోధించారు. ఇలాంటి సంస్థలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తే పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతాయి. అన్ని వర్గాల వారిని అక్కున చేర్చుకొని పైసా ఖర్చు లేకుండా శిక్షణ ఇవ్వడం గొప్ప విషయం.