సిటీబ్యూరో, జూలై 9 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన విద్యార్థులకు ఉద్యోగులుగానో.. పారిశ్రామికవేత్తలుగానో తీర్చిదిద్దేలా సిలబస్ ఉండడంపై ఆ యూనివర్సిటీ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఓయూ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజీ ఆధ్వర్యంలో ప్రస్తుత ట్రెండింగ్ మార్కెట్‌కు అనుగుణంగా కొత్త సిలబస్ రూపుదిద్దుకుంటున్నది. అందుకు సంబంధించి బోర్డ్ ఆఫ్ స్టడీస్ (బీవోఎస్) ఆధ్వర్యంలో కొత్త కోర్సులు, కొత్త సిలబస్‌పై త్వరలోనే సమావేశం కానున్నది. అయితే ఐటీ, ఉత్పాదక, సర్వీసు రంగాలకు చెందిన యాజమాన్యాలు లేదా పారిశ్రామికవేత్తలు బీటెక్, ఎంటెక్‌తో ఇంజినీరింగ్ కోర్సు పూర్తి చేసిన యువతలో అవసరమైన నైపుణ్యాలు ఉండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగం బాగా విస్తరిస్తున్న నేపథ్యంలో.. ఆయా ఉద్యోగాలకోసం సిలబస్ రూపకల్పనలో పారిశ్రామిక వేత్తలను, సాఫ్ట్వేర్ దిగ్గజాలను, పెద్ద కంపెనీలకు చెందిన సీఈవోలు, ఐఐటీ, ఎన్ఐటీలకు చెందిన ప్రొఫెసర్లతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలకు బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్ వంటి కంపెనీలకు చెందిన ప్రతినిధులను భాగస్వాములను చేస్తున్నామని ఓయూ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రిన్సిపల్ శ్రీరామ్ వెంకటేశ్ తెలిపారు.
జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) ప్రకారం డిగ్రీలు ప్రదానం చేయడంపై నూతన విధానాలు అవలంబిస్తున్నారు. అందులో భాగంగా మేజర్ డిగ్రీలతో పాటు మైనర్ డిగ్రీలను కూడా ప్రవేశపెట్టబోతున్నారు. అందుకు ఓయూ అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. ఇంజినీరింగ్ సివిల్, మెకానికల్, ఈఈఈ వంటి విభాగాలతో బీటెక్ పూర్తి చేసిన లేదా థర్డ్ ఇయర్ లేదా ఫైనల్ ఇయర్ చదువుతున్న యువత సీఎస్ఈలో ఏఐఎంల్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐవోటీ, కంప్యూటర్ ఇంజినీరింగ్ వంటి మార్కెట్లో డిమాండ్ ఉన్న నూతన కోర్సులను మైనర్ డిగ్రీల విధానంలో పూర్తి చేసుకునే వెసులుబాటు కల్పించే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టామని ప్రిన్సిపాల్ తెలిపారు.
బీటెక్ చేసినా పొలిటిక్ సైన్స్,పబ్లిక్అడ్మినిస్ట్రేషన్, లా కోర్సులకు అర్హులే..
బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు.. ఆ తర్వాత పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్, ఎంబీఏ, కామర్స్ వంటి కోర్సులతో పాటు సోషియాలజీ, సైకాలజీ వంటి కోర్సులు చేయడానికి అర్హత కల్పించడానికి యూనివర్సిటీ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. దీనిని 2022-23 విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని భావిస్తుంది. అయితే మెరిట్ మార్కులు లేదా క్రెడిట్స్‌తో ఉత్తీర్ణత సాధిస్తారో వారికి మాత్రమే అర్హులుగా పరిగణిస్తామని ప్రిన్సిపాల్ అన్నారు. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం వెలువడుతుందన్నారు.