సుల్తాన్ బజార్, జూలై 9: టీఎన్జీఓ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. నగరంలోని వివిధ ప్రభుత్వ శాఖల టీఎన్జీవో యూనిట్ల నాయకులు, ఉద్యోగులు ఈ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. దవాఖానలకు స్ట్రెచర్లను విరాళంగా అందజేశారు. అన్నదానం, అనాథ విద్యార్థులకు అవసరమైన వంట సామగ్రిని అందజేయడం వంటి పలు సేవా కార్యక్రమాలను నిర్వహించి, నగరంలో పలు చోట్ల మొక్కలు నాటారు.
టీఎన్జీఓ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులుగా ముజీబ్ హుస్సేన్ పలు పర్యాయాలుగా కొనసాగుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పాటు పడుతూ వస్తున్నారు. కారుణ్య నియామకాలు చేపట్టడంలో ప్రత్యేక కృషి చేయడం, పదోన్నతులు లభించేలా చర్యలు తీసుకోవడం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఔట్ సోర్సింగ్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు అండగా నిలిచి వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు. హుస్సేని తన పుట్టిన రోజు సందర్భంగా సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖానకు గర్భిణుల సౌకర్యార్థం పది స్ట్రెచర్లను విరాళంగా అందజేశారు. శనివారం దవాఖానాలో సూపరింటెండెంట్ డాక్టర్ కె రాజ్యలక్ష్మికి ముజీబ్ హుస్సేని సతీమణి సీమతో కలిసి స్ట్రెచర్లను అందించారు.
అదే విధంగా డాన్ బాస్కో అనాథాశ్రమంలోని చిన్నారుల కోసం మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, వంట పాత్రలను ఆశ్రమ నిర్వాహకులకు అందజేశారు. నగరంలోని గాంధీ, ఉస్మానియా, సరోజినీదేవి కంటి దవాఖాన, చెస్ట్, ఉస్మానియా దంత వైద్య కళాశాల, గన్‌ఫౌండ్రిలోని డీఈఓ కార్యాలయంలో తన పుట్టిన రోజు సందర్భంగా ఆయా కార్యాలయాల యూనిట్ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. కాగా, ఆదివారం నగరంలోని పలు ప్రాంతాలలో అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యక్షుడు కురాడి శ్రీనివాస్ తెలిపారు. సికింద్రాబాద్ గణపతి దేవాలయం, ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖానాలోని అమ్మవారి ఆలయంలో ముజీబ్ హుస్సేని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు.