రెండు రోజులుగా ఎడతెరపిలేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీహెచ్ఎంసీ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి వర్షపాతం పరిస్థితి, వచ్చిన ఫిర్యాదుల వివరాలు, పరిషారం దిశగా నిత్యం ప్రయత్నాలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షపాతం, కంట్రోల్‌రూం పనితీరు, ఫిర్యాదుల స్వీకరణపై జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నిన్నటి నుంచి 1.5 సెం.మీ. నుంచి 6.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు పేర్కొన్నారు. శనివారం వరకు 383 ఫిర్యాదులు అందాయని, ఇప్పటి వరకు 375 పరిషరించామని, మిగిలిన 8 పూర్తయ్యే దశలో ఉన్నాయని తెలిపారు. 197 చెరువుల వద్ద అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. పలు చెరువుల్లోకి నీటి ప్రవాహాన్ని పర్యవేక్షించడానికి బృందాలు నిమగ్నమై ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితి వస్తే స్లూయిస్ గేట్లను ఎత్తి నీటిని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
కాలానుగుణంగా వచ్చే వ్యాధులను నియంత్రించడానికి ఎంటమాలజీ విభాగం ఫాగింగ్, స్ప్రెయింగ్ లార్వా నిరోధక చర్యలను వర్షాలు రాకముందు నుంచే చర్యలు చేపట్టినట్లు వివరించారు. జీహెచ్ఎంసీ అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటోందని, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పరిస్థితిని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. వర్షాకాలంలో ప్రయాణికులు, ప్రజలు ఇబ్బందులు పడకుండా ఎస్ఎన్డీపీ పనులు ఎకడ జరుగుతున్నాయో తెలియజేసే సూచిక బోర్డులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి పని వద్ద ఒక అధికారిని నియమిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సూచిక బోర్డులను ఏర్పాటు చేసి చర్యలు తీసుకున్నామని ఉన్నతాధికారులు తెలియజేశారు.
మొబైల్, మినీ మొబైల్, స్టాటికల్లాంటి మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లను ఏర్పాటు చేసి, నీట నిలిచిన ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు తొలగిస్తున్నట్లు వివరించారు. ఇదిలా ఉంటే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న 13 మున్సిపాలిటీలలో 23 మాన్సూన్ బృందాలు ఏర్పాటు చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో జిల్లాలోని మున్సిపాలిటీల కమిషనర్లు అందుబాటులో ఉండాలని ఉన్నాతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. వరదనీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్ తెలిపారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మేయర్ విజయలక్ష్మి
వర్షాల నేపథ్యంలో శనివారం జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పలు ప్రాంతాల్లో పర్యటించారు. రసూల్‌పురాలోని మినిస్టర్ క్రాస్ రోడ్డు వద్ద పికెట్ నాలాపై ఎస్ఎన్డీపీ ద్వారా చేపట్టిన రీమోడలింగ్ బ్రిడ్జి ఒక వైపు పూర్తయిన పనులను పరిశీలించారు. అకడ నుంచి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ సెంటర్‌ను పరిశీలించారు. ఫిర్యాదుల పరిషారంపై ఓఎస్డీ అనురాధను అడిగి తెలుసుకున్నారు. కమాండ్ అండ్ కంట్రోల్ రూంను సందర్శించి నగరంలో వర్షపాతం పరిస్థితిని సమీక్షించారు. పౌరులు తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవడానికి 040-21111111, 040-29555500 నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.