సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ): నగరంలోని ప్రధాన దవాఖానల్లోని వ్యర్థ జలాలను శుద్ధి చేసేందుకు అవసరమైన మురుగునీటి శుద్ధి ప్లాంట్ల(ఎస్టీపీ ప్లాంట్లు)ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దవాఖానల నుంచి వెలువడే వ్యర్థ జలాల వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దవాఖానల్లో ఆపరేషన్ థియేటర్స్, ల్యాబ్స్, పేషెంట్ల బెడ్‌షీట్స్ ఉతికే సమయంలో, వార్డులను శుభ్రపరిచిన తదితర వ్యర్థ జలాలను నేరుగా బయటకు విడుదల చేయడంతో తీవ్రమైన పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది. దీన్ని నివారించేందుకు నగరంలోని నాలుగు ప్రధాన దవాఖానలైన గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖానల్లో ఎస్టీపీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఒక్కో దవాఖానకు రూ.6.73 కోట్లు
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 20దవాఖానల్లో ఎస్టీపీ ప్లాంట్లను ఏర్పాటు చేయనుండగా నగరంలో తొలివిడతగా 4దవాఖానల్లో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో దవాఖానలో రూ.6.73కోట్లతో మొత్తం నాలుగు దవాఖానల్లో రూ.26.92కోట్ల వ్యయంతో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నెలరోజుల్లో ఈ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్లను పిలువనున్నట్లు అధికారులు తెలిపారు.
హెచ్ఏఎం మోడల్లో నిర్మాణం
ఎస్టీపీ ప్లాంట్లను అత్యాధునిక ‘హైబ్రీడ్ యాన్యువిటి మోడల్'(హెచ్ఏఎం)లో నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. నిర్మాణ సంస్థలే ఈ ప్లాంట్లను 10సంవత్సరాల పాటు నిర్వహించే విధంగా టెండర్లలో ఒప్పందం కుదుర్చుకునేందుకు అధికారులు ప్రాణాళిక రూపొందించారు.
ఇలా శుద్ధి చేస్తారు
దవాఖానల్లోని ఆయా విభాగాల నుంచి వెలువడే వ్యర్థ జలాలను ముందుగా డిసిన్ఫెక్ట్ చేసి ఎస్టీపీలకు పంపుతారు. అక్కడ నీటిని శుద్ధి చేసి మళ్లీ వినియోగించే విధంగా తయారు చేసి బయటకు వదులుతారు. దీని వల్ల నీటి వనరులు కలుషితం కాకుండా ఉంటాయి.