బేగంపేట్, జూలై 8: ‘లష్కర్ ఉజ్జయిని మహంకాళి ఉత్సవాలను భక్తులు సమన్వయంతో వ్యవహరించి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించుదాం. అందుకు ప్రభుత్వం భక్తులకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. జాతరకు వచ్చే భక్తులతో పాటు వివిధ శాఖల అధికారులు, సేవలు అందించే వారితో పాటు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రతి ఒక్కరు సమన్వయంతో పని చేసి బోనాల జాతర ఉత్సవాలను విజయవంతం చేయాలి’ అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హోం శాఖ మంత్రి మహమూద్ అలీతో కలిసి శుక్రవారం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి దేవాలయం ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో సన్నాహక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 17, 18న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ఘనంగా చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, జల మండలి ఎండీ దాన కిశోర్, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డిలు మాట్లాడుతూ, జాతర నిర్వహణ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు. ప్రస్తుతం బోనాల వేడుకలు విశ్వవ్యాప్తం అయ్యాయని చెప్పారు. మహంకాళి అమ్మవారికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నదన్నారు. ఈ క్రమంలో సేవలందించే వాలంటీర్లకు మంత్రి తలసాని సలహాలు, సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తర మండలం డీసీపీ చందన దీప్తి, ఆర్డీవో వసంత కుమారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటి, మహంకాళి దేవాలయం ఈవో గుత్తా మనోహర్‌రెడ్డి, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రంగారావు, ఏసీపీ రమేశ్, గంగారెడ్డి, సీఐ కావేటి శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు, దేవాలయం ఫౌండర్ సభ్యులు చైర్మన్ సురిటి కామేశ్, స్థానిక కార్పొరేటర్ చీర సుచిత్ర, మాజీ కార్పొరేటర్ అరుణ గౌడ్, పాల్గొన్నారు. మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్ అమ్మవారిని దర్శించుకున్నారు.
1500 మంది పోలీస్ సిబ్బంది.. 15 ప్లాటూన్స్‌తో బందోబస్త్
బోనాల జాతర ఉత్సవాలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాంతి యుతంగా నిర్వహించేందుకు 1500 మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే ఆలయ పరిసరాలలో 114 సీసీ కెమరాలు ఉన్నాయి. వాటిని 200 వరకు పెంచే ఆలోచనలో ఉన్నాం. ఈవ్ టీజింగ్ జరగకుండా షీ టీంలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరు పోలీసులు, అధికారులతో సహకరించాలి. ఓపికతో జాతరను చూసి తరించండి.
– పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్
అందుబాటులో మెడికల్ క్యాంపులు.. తాగునీరు
జాతరకు వచ్చే భక్తులకు మెడికల్ క్యాంపులతో పాటు 6 లక్షలకు పైగా వాటర్ ప్యాకెట్స్, 25 వేల వరకు వాటర్ బాటిల్స్ అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేస్తున్నాం. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య ఇబ్బందులు తలెత్తకుంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నాం.
– జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్