మేడ్చల్ రూరల్, జూలై 8 : గుండ్లపోచంపల్లిలో కరెంట్ కష్టాలు తీరనున్నాయి. చాలా కాలంగా పడిన ఇబ్బందులను తీర్చేందుకు విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గుండ్లపోచంపల్లికి ప్రత్యేకంగా ఫీడర్ ఏర్పాటు చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో ఎదుర్కొంటున్న సమస్యలను ‘నమస్తే తెలంగాణ’ ‘విద్యుత్ సమస్యను పరిష్కరించండి’ అనే శీర్షికతో గత నెల 22న ప్రచురించింది. స్పందించిన శాఖ అధికారులు పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.
కరెంట్ పోతే..
గుండ్లపోచంపల్లికి విద్యుత్‌ను సరఫరా చేసే ఫీడర్ 18 కిలోమీటర్లు ఉంది. దీంతో ఏదైనా సమస్య తలెత్తితే గుర్తించడం అధికారులకు కష్టంగా ఉండేది. గాలి వర్షం వచ్చినప్పుడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే పునరుద్ధరించడానికి చాలా సమయం పట్టేది. ఒకవేళ రాత్రి పూట అంతరాయం ఏర్పడితే రాత్రంతా ప్రజలు మేలుకోవాల్సిందే. చాలా రోజులుగా ఈ పరిస్థితిని ప్రజలు ఎదుర్కొని, ఇబ్బంది పడ్డారు. కరెంట్ ఇబ్బందులను పలు మార్లు చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు, స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కొత్త ఫీడర్ ఏర్పాటుకు శాఖ అధికారులు సిద్ధమయ్యారు.
రూ.12 లక్షల వ్యయంతో…
విద్యుత్ సరఫరాలో జరుగుతున్న తీవ్ర అంతరాయ సమస్యను పరిష్కరించేందుకు ఏఈ శశిధర్ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు రూపొందించి, ఉన్నతాధికారులకు పంపించారు. రూ.12 లక్షల వ్యయంతో గుండ్లపోచంపల్లికి ప్రత్యేక లైన్ ఏర్పాటు చేయాలని సంకల్పించారు. నిధులు మంజూరు కావడంతో ఇటీవల పనులు ప్రారంభమయ్యాయి. 24 స్తంభాలను ఏర్పాటు చేసి, మూడు కిలోమీటర్ల మేర ప్రత్యేక లైన్‌ను గుండ్లపోచంపల్లికి ఏర్పాటు చేస్తున్నారు. 60 శాతం మేరకు పనులు పూర్తయ్యాయి. కొత్త ఫీడర్ ఏర్పాటైతే కరెంట్ సరఫరాలో సమస్య ఉండదని అధికారులు వెల్లడించారు.
వారం రోజుల్లో పూర్తి..
గుండ్లపోచంపల్లి పరిధిలోని విద్యుత్ సమస్యల పరిష్కారానికి 11కేవీ ఫీడర్ బైఫర్కేషన్ పనులు చేపట్టాం. ఆ పనులు వారం రోజుల్లో పూర్తి అవుతాయి. విద్యుత్ సమస్యల పరిష్కారానికి రూ.12 లక్షల వ్యయంతో లైన్ ఏర్పాటు చేసి, నాలుగు ట్రాన్స్ఫార్మర్లను అమర్చుతున్నాం. దీంతో నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతుంది.
-ఎస్వీవీ సత్యనారాయణ రాజు, ఏడీఈ, మేడ్చల్