సిటీబ్యూరో/బేగంపేట, జూలై 7 (నమస్తే తెలంగాణ): పుట్టుకతోనే గూనితో బాధపడుతున్న ఇద్దరు ఇరాన్ దేశానికి చెందిన బాలికలకు నగరంలోని కిమ్స్ హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స చేశారు. సుమారు 8 గంటల పాటు నిర్వహించిన ఈ శస్త్రచికిత్స విజయవంతమవడంతో బాలికల తల్లిదండ్రుల ఆనందానికి అంతులేదు. వివరాల్లోకి వెళితే.. ఇరాక్ దేశంలోని బాగ్దాద్ ప్రాంతానికి చెందిన దంపతులకు ఇద్దరు కూతుళ్లు. 14, 17ఏండ్ల వయస్సుగల ఈ ఇద్దరు బాలికలకు పుట్టుకతోనే గూని సమస్య ఉంది.
బాలికల వయస్సు పెరిగే కొద్ది నడకలో ఇబ్బంది, ఊపిరి అందకపోవడం, శరీరాకృతి వికారంగా మారడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో వారి తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న దవాఖానలను ఆశ్రయించగా పిల్లలిద్దరికీ పుట్టుకతోనే గూని ఉన్నట్లు నిర్ధారించారు. శస్త్రచికిత్స చేస్తే వెన్నెముకకు గాయమయ్యే ప్రమాదం ఉన్నదని అక్కడి వైద్యులు చెప్పారు. దీంతో భారత్‌లో మెరుగైన వైద్యం లభిస్తుందని తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు ఇటీవల హైదరాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్‌ను ఆశ్రయించారు. వెన్నెముక వైద్యనిపుణులు డాక్టర్ సురేశ్ చీకట్ల వీరి కేసు షీట్‌ను పరిశీలించారు.
బాలికలిద్దరికీ ఎక్స్‌రే, సీటీ-స్కాన్, ఎంఆర్ఐ తదితర వైద్య పరీక్షలు చేయించారు. బాలికలిద్దరికీ ‘డోర్సల్ కైఫోసోలియోసిస్’ అనే సమస్య ఉన్నట్లు గుర్తించారు. బాలికలిద్దరిలో వెన్నెముక దాదాపు 150 డిగ్రీల కంటే ఎక్కువగా వంపు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. బాలికలిద్దరికీ సుమారు 8గంటల పాటు గుండె వైద్య నిపుణులు, న్యూరో ఫిజీషియన్, పల్మనాలజిస్టు తదితర విభాగాల వైద్యనిపుణుల సహకారంతో శస్త్రచికిత్స నిర్వహించినట్లు డాక్టర్ సురేశ్ చీకట్ల తెలిపారు. ఈ సర్జరీలో ముందుగా ఎముకలోనికి స్క్రూలను పంపించి, వెన్నెముక వంపు అధికంగా ఉన్న మధ్య భాగం గూని, వంపును సరిచేయడానికి ‘ఆస్టియాటమి’ పద్ధతిని ఉపయోగించినట్లు వైద్యులు తెలిపారు. స్క్రూల ద్వారా సపోర్టింగ్ రాడ్స్‌ని అమర్చామన్నారు.
పక్కటెముకలు సైతం లోనికి చొచ్చుకుని పోయాయని, వెన్నెముకకు అతుక్కున్న ప్రాంతం నుంచి ‘థొరకోప్లాస్టి’ పద్ధతిలో విడదీసినట్లు వివరించారు. పలు రకాల ఆధునిక పద్ధతలను ఉపయోగించి వెన్నెముకను సరిచేయడంతో పాటు వెన్నెముకపై ఎలాంటి ఒత్తిడి పడకుండా అతి జాగ్రత్తగా గూని సమస్యను సరిచేసినట్లు వివరించారు. బాలికలిద్దరూ పూర్తిగా కోలుకోవడంతో 5వ రోజున దవాఖాన నుంచి డిశ్చార్జి చేసినట్లు డాక్టర్ సురేశ్ చీకట్ల వివరించారు. అవసరమైన వైద్య ఖర్చులను ఇరాక్ ప్రభుత్వం భరించినట్లు తెలిపారు.