మేడ్చల్, జూలై7(నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీల పై జరుగుతున్న దాడులపై తక్షణమే స్పందించి కేసులు నమోదు చేయాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ అధికారులను ఆదేశించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లోని సమావేశం హాల్లో గురువారం జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ నమోదైన కేసులను సత్వరమే పరిష్కరించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని, అలా చేసినప్పుడే బాధితులకు సరైన న్యాయం జరుగుతుందన్నారు. ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించవద్దని కలెక్టర్ హరీశ్ సూచించారు. ఎస్సీ, ఎస్టీ బాధితులకు సంబంధించి పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన వెంటనే కేసులు నమోదు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులకు సంబంధించిన వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు. అవసరమైతే తన దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు న్యాయం అందించేందుకు విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి దళితబంధును ప్రవేశపెట్టిందని చెప్పారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహా రెడ్డి, డీసీపీలు రక్షితామూర్తి, సందీప్, జిల్లా అధికారులు బాలాజీ, వినోద్, కమిషన్ సభ్యులు, విజిలెన్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.