మియాపూర్, జూలై 7 : ప్రజావసరాలు తీర్చడంలో ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేస్తున్నట్లు ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. లక్షలాది నిధులు వెచ్చించి చేపడుతున్న అభివృద్ధి పనులలో ప్రజలు సైతం భాగస్వాములు కావాలని తద్వారా మరింత నాణ్యత పెరుగుతుందన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ ఇంద్రహిల్స్, మహంకాళీనగర్లలో రూ.59 లక్షలతో చేపడుతున్న యూజీడీ పనులను కార్పొరేటర్లు వెంకటేశ్ గౌడ్, మాధవరం రోజాదేవిలతో కలిసి విప్ గాంధీ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కరోనా వంటి పరిస్థితులు నెలకొన్నా.. అభివృద్ధిలో వెనకడుగు వేయలేదని, సీఎం కేసీఆర్ దక్షతే ఇందుకు నిదర్శనమన్నారు. నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు, నిధుల మంజూరు సాధిస్తూ పురోగతికి కృషి చేస్తున్నట్లు విప్ గాంధీ పేర్కొన్నారు. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారంగా నాలాలు, డ్రైనేజీలను మరింత పటిష్టపరుస్తున్నామని, నిర్మాణ పనులలో నాణ్యతను పాటించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డీజీఎం వెంకటేశ్వర్లు, మేనేజర్ ఝాన్సీ, రవీందర్‌రెడ్డి, శివ, మల్లేశ్, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, పార్టీ నేతలు సమ్మారెడ్డి, సంజీవరెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, అనీల్‌రెడ్డి, గణేశ్, శ్రీనివాస్, రాజేశ్,కాశీ, వెంకట్, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.
జీహెచ్ఎంసీ అలింకో సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో దివ్యాంగులకు, వయో వృద్ధులకు ఉచిత పరికరణాల పంపిణీకి అర్హులను గుర్తించేందుకు హైదర్‌నగర్ డివిజన్ హెచ్ఎంటీ హిల్స్ కమ్యూనిటీహాల్లో నిర్వహించిన గుర్తింపు శిబిరాన్ని కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, వెంకటేశ్ గౌడ్ మాధవరం రోజాదేవిలతో కలిసి విప్ గాంధీ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసరా పెన్షన్ల ద్వారా దివ్యాంగులకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారన్నారు. ఉపకరణాలను సద్వినియోగం చేసుకుని ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. సామాజిక కార్యక్రమం కింద దివ్యాంగులను, వయో వృద్ధులకు కీలకమైన ఉపకరణాలను అందిస్తున్న సంస్థను విప్ గాంధీ అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్చార్జి పీవో ప్రభాకర్, పార్టీ నేతలు సంజీవరెడ్డి, సమ్మారెడ్డి, శ్రీనివాస్, దామోదర్‌రెడ్డి, అనీల్‌రెడ్డి, పోతుల రాజేందర్ పాల్గొన్నారు.
ఆల్విన్ కాలనీ డివిజన్ ఇంద్రహిల్స్ నుంచి సాయిచరణ్ కాలనీలో నాలా దాటేందుకు వీలుగా రూ.50 లక్షలతో చేపడుతున్న కల్వర్టు నిర్మాణ పనులను కార్పొరేటర్లు వెంకటేశ్ గౌడ్, మాధవరం రోజాదేవిలతో కలిసి విప్ గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సౌకర్యమే తమకు అత్యంత ప్రధానమన్నారు. దూరం తగ్గించేందుకు కాలనీలను అనుసంధానించేందుకు ఈ కల్వర్టు ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నేతలు పాల్గొన్నారు.