అంబర్‌పేట, జూలై 7: నలభై ఏండ్లుగా నానుతున్న ముస్లిం శ్మశాన వాటికకు స్థలం కేటాయింపు గురువారం ఎట్టకేలకు పూర్తైంది.కొత్త శ్మశాన వాటికకు స్థలం కావాలని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న వారి కల నెరవేరబోతున్నది. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ విశేష కృషితో మంత్రి కేటీఆర్ ఆదేశాలతో అంబర్‌పేటలోని ట్రీట్మెంట్ ప్లాంటులో జలమండలికి చెందిన స్థలాన్ని ముస్లిం శ్మశాన వాటికకు కేటాయించారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, స్థానిక కార్పొరేటర్ ఇ.విజయ్‌కుమార్‌గౌడ్ సమక్షంలో జలమండలి సీజీఎం ప్రసన్నకుమార్, జీఎం సుబ్రమణ్యం, డీజీఎం రాజ్‌కుమార్‌లు జీహెచ్ఎంసీ అంబర్‌పేట సర్కిల్ టౌన్‌ప్లానింగ్ ఏసీపీ సాయిబాబాకు గురువారం స్థలం కేటాయింపు పత్రాన్ని అందజేశారు. అంబర్‌పేట నియోజకవర్గంలో ఉన్న ముస్లింలకు ఖాద్రిబాగ్ వద్ద ఒకే ఒక శ్మశానవాటిక ఉంది.
ఇది సరిపోవడం లేదు. దీంతో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు చేయడానికి ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ముస్లింలు 40 సంవత్సరాలుగా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలందరి దృష్టికి తీసుకువెళ్లారు. ఎవరు కూడా ఈ సమస్యను పరిష్కరించలేదు. ప్రస్తుత ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఎన్నికల ప్రచార సభలో మంత్రి కేటీఆర్ దృష్టికి సమస్య తీసుకెళ్లగా శ్మశానానికి స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కరోనా రావడం తదితర కారణాల వల్ల కొద్దిగా ఆలస్యమైంది. ఇటీవల ఈ విసయాన్ని ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించిన మంత్రి అంబర్‌పేటలో ముస్లిం శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని జలమండలి ఎండీని ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు సర్వే చేసిన అధికారులు అంబర్‌పేటలో గల సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద స్థలం ఉందని గుర్తించారు. అక్కడ శ్మశాన వాటిక ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని భావించి ఆ స్థలాన్ని కేటాయించారు. ఈ మేరకు ఎమ్మెల్యే సమక్షంలో స్థలం కేటాయింపు పత్రాలను జలమండలి అధికారులు జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులకు ఇచ్చారు. తర్వాత జీహెచ్ఎంసీ ద్వారా శ్మశాన వాటికను అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకువస్తారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్లుగా పరిష్కారం కాని ముస్లిం గ్రేవ్‌యార్డు సమస్యను టీఆర్ఎస్ ప్రభుత్వం తీరుస్తున్నదని చెప్పారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో జలమండలి అధికారులు స్థలాన్ని జీహెచ్ఎంసీ అధికారులకు అప్పగించారన్నారు. త్వరలోనే అభివృద్ధి పనులు మొదలవుతాయని తెలిపారు. స్థలం కేటాయించినందుకు మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు అనిల్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.