సిటీబ్యూరో, జూలై 7(నమస్తే తెలంగాణ): నగరంలో రోడ్లపై వేస్తున్న వ్యర్థాల నివారణకు జీహెచ్ఎంసీ మరో రెండు సీ అండ్ డీ (కన్స్ట్రక్షన్స్ అండ్ డెమోలిషన్ వేస్ట్) ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే రెండు జీడిమెట్ల, ఫతుల్లాగూడలలో ఏర్పాటు చేసిన ప్లాంట్లలో ప్రాసెస్ చేస్తున్నారు. రోజుకు ఒకొక ప్లాంట్ సుమారు 500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ప్రాసెస్ చేస్తున్నది. ఈ క్రమంలోనే మరో రెండు చోట్ల సీ అండ్ డీ ప్లాంట్ల ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయించారు. ఈ మేరకు సికింద్రాబాద్, చార్మినార్ వైపు కూల్చివేసిన, భవన నిర్మాణ వ్యర్థాల సేకరణకు జీహెచ్ఎంసీ టెండర్లను పిలిచినట్లు అధికారులు తెలిపారు. ప్లాంట్ ఏర్పాటుకు నగరానికి 10 కిలో మీటర్ల దూరం, ఐదెకరాలకు పైబడి సొంత భూమి ఉండాలని ఆ టెండర్లలో పొందుపర్చగా రెండు ప్లాంట్ల ఏర్పాటుకు ఒకే ఏజెన్సీకి ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపించామని, ప్రభుత్వ అనుమతి ఇచ్చిన వెంటనే సదరు ఏజెన్సీతో జీహెచ్ఎంసీ ఎంఓయూ చేసుకోనుందని అధికారులు పేర్కొన్నారు.
ప్రాసెసింగ్ ప్లాంట్ను రెండు ప్యాకేజీలుగా చేశారు. ప్యాకేజీ-1 చార్మినార్ కింద చాంద్రాయణగుట్ట, చార్మినార్, ఫలక్నుమా, రాజేంద్రనగర్, మెహిదీపట్నం, కార్వాన్, గోషామహల్, జూబ్లీహిల్స్, 2వ ప్యాకేజీ సికింద్రాబాద్ కింద కాప్రా, ముషీరాబాద్, ఖైరతాబాద్, అల్వాల్, మలాజిగిరి, సికింద్రాబాద్, బేగంపేట్ సరిళ్లలో వ్యర్థాలు సేకరిస్తారు. కూల్చివేసిన, భవన నిర్మాణ వ్యర్థాలు అనుమతి లేని చోట వేసిన పక్షంలో జరిమానాతో పాటు చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.