కవాడిగూడ, జూలై 5: పేరుమోసిన అంతర్రాష్ట్ర దొంగను గాంధీనగర్ పోలీసులు మంగళవారం అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ ఎన్.మోహన్ రావు తెలిపిన వివరాల ప్రకారం… కోదండరెడ్డినగర్‌లో గత నెల 25న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో ఎవరూలేని సమయంలో తాళాలు పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. రూ.3 లక్షల నగదు, 4 తులాల బంగారు అభరణాలను అపహరించుకుపోయారు. ఇంటి యజమాని జి.మురళీమోహన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డీఐ ప్రమోద్‌కుమార్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి 1:30 గంటల ప్రాంతంలో కవాడిగూడ వద్ద నిందితుడిని పట్టుకున్నారు. విచారించగా మరో ఆరు చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడి వద్ద నుంచి టీఎస్ 13 యూసీ 5583 నంబరు గల కారుతో పాటు రెండు సెల్ఫోన్లు, 190 గ్రాముల బంగారు ఆభరణాలు, నగదు రూ.3 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
తాళంవేసి ఉన్న ఇండ్లే.. టార్గెట్
ఏపీలోని నర్సారావుపేటకు చెందిన మిక్కిలి వంశీకృష్ణ, అలియాస్ లోకేశ్, సామ్ రిచర్డ్ జల్సాల కోసం దొంగతనాలు చేయడం పరిపాటిగా మార్చుకున్నాడు. స్టార్ హోటల్స్‌లో బసచేస్తూ.. పగలు కాలనీల్లో రెక్కీ నిర్వహించి తాళంవేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసుకుని రాత్రి సమయంలో చోరీలు చేస్తుంటాడు. నగరంలోని గాంధీనగర్, బేగంబజార్, ఏపీలోని గుంటూరు జిల్లా నరసారావుపేట 1-టౌన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు చోరీలకు పాల్పడినట్లు నిందితుడు తెలిపాడు. సంపాదించిన చోరీ సొత్తుతో తన కుటుంబ సభ్యులు స్థిరపడ్డారని పేర్కొన్నాడు.
జైలుకు వెళ్లివచ్చినా మారలేదు..!
వంశీకృష్ణ 2004లో ఎంబీఏ పూర్తి చేశాడు. 2006లో సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగతనం కేసులో అరెస్టు కావడంతో 18 నెలలు జైలులో ఉన్నాడు. 2009లో మరోమారు సరూర్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. తర్వాత బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు కేసుల్లో అరెస్టుకాగా 8 నెలలు జైలులో ఉన్నాడు. ఎల్బీనగర్ పీస్ పరిధిలో 13ఇండ్లలో చోరీకి పాల్పడి 21 నెలలు జైలు జీవితం గడిపాడు. పీడీ యాక్ట్ విధించడంతో జైలుకు వెళ్లి 2018 ఆగస్టు 18న విడుదలయ్యాడు. గడిచిన పదేండ్లలో 28 చోరీలకు పాల్పడినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు. చోరీల కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని సెంట్రల్ జోన్ డీసీపీ రాజేశ్చంద్ర అభినందించారు.