సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : ఒకప్పుడు మన అమ్మమ్మ, నాన్నమ్మల నుంచి మొదలైన పచ్చబొట్టు సంస్కృతి అనేక రూపాంతరాలు చెంది టాటూగా నేటి తరాన్ని శాసిస్తున్నది. ఇష్టసఖులపై ప్రేమతో పేర్లు..సింబళ్లు, విభిన్న ఆకృతులతో శరీర భాగాలను కప్పేస్తున్నది యూత్. అయితే ఏవేవో కారణాలతో పచ్చబొట్టు పొడిపించుకున్న వారు.. కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఆ గుర్తులను తొలగించుకునేందుకు తిప్పలుపడుతున్నారు. వేలల్లో ఖర్చుపెట్టి టాటూ వేసుకుంటే.. లక్షలు వెచ్చించి.. చెరిపేసుకుంటున్నారు. టాటూను తొలగించుకోవచ్చేమో కానీ అది మిగిల్చిన మచ్చ మాత్రం పూర్తిగా చెరిపి వేయలేమంటున్నారు నిపుణులు. పచ్చబొట్టు కలకాలం నిలవాలన్నా.. చేదు జ్ఞాపకంగా మారకుండా ఉండాలన్నా.. కొన్ని నియమాలు పాటించాలంటున్నారు.
అవగాహన ఉండాల్సిందే
టాటూ వేయించుకోవడమంటే.. చిన్నపాటి సర్జరీ చేయించుకోవడమే. ఆరోగ్యం, ఆహార నియమాలు, మనకు పడని మందుల విషయాలన్నింటిపై అవగాహన ఉండాలి. కొందరికి పిగ్రెట్ ఇంజెక్షన్స్ పడవు. ఇవి రియాక్షన్స్ ఇస్తాయి. టాటూ వేసిన చోటంతా పుండుగా మారడంతో పాటు జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి టాటూ వేయించుకున్నాక చర్మం ఉబ్బుతుంది. దీన్ని కిలాయిడ్ టెండెన్సీ అంటారు. వాళ్లు వీటికి దూరంగా ఉండాలి. ఆరోగ్య పరిస్థితి కారణంగా స్టిరాయిడ్ మందు లు, కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు మందు లు వాడుతున్నప్పుడు వీటి జోలికి పోకూడదు. టాటూలతో నష్టమే కానీ.. లాభం లేదనే విషయం గ్రహించాలి.
-డాక్టర్ నవజన్ కుమార్
మచ్చ మాత్రం పూర్తిగా పోదు…
డెర్మబిరేషన్, సర్జికల్, లేజర్ ఇలా మూడు పద్ధతులతో టాటూలను తొలగిస్తారు. డెర్మాబిరేషన్ చాలా నొప్పితో కూడుకున్నది. పై చర్మం పొర తీసేస్తారు. ఇది చేయించుకున్న తర్వాత మూడు నెలల పాటు సూర్యకాంతి తగలకూడదు. లేజర్ చికిత్స ద్వారా టాటూను తొలగించేందుకు 8 సిట్టింగులు అవసరమవుతాయి. సర్జికల్ విధానం ఖర్చుతో కూడుకుంది. వీటిలో ఏ చికిత్స అయినా టాటూ పోయినా.. మచ్చ మాత్రం పూర్తిగా పోదు. అయితే టాటూలను తొలగించుకోవాలనుకునే వారు నిపుణులను సంప్రదించాలి.
-అరుణ్, టాటూ ఎక్స్పర్ట్
అనేక సమస్యలు వస్తాయి…
టాటూ ట్రెండ్‌గా మారి దశాబ్దాలు అవుతున్నా.. దానిపట్ల ఉన్న వ్యామోహం ఇంకా తగ్గడం లేదు. ఒకప్పుడు సంపన్నులకే పరిమితం అనుకున్నది… ఇప్పుడు అన్ని తరగతులకూ పాకింది. హైఫై స్టూడియోలను దాటి హైవేలపై దుకాణాల దాకా వచ్చేసింది. ఈ వేగంలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ టాటూలే అమ్మాయిలను సమస్యలో పడేస్తున్నాయి. అమ్మాయిలు తొందరపడొద్దు. ప్రేమలో ఉన్నంతకాలం బాగానే ఉంటుంది. అది విడిపోయాక జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
-కవితపాన్యం, సైకాలజిస్టు.