Banswada | బాన్సువాడ: బాన్సువాడ ఎస్ఆర్ఎన్కే కళాశాలలో విలేకరుల పునశ్చరణ తరగతుల కార్యక్రమం కొనసాగుతుంది. బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి ప్రెస్ అకాడమీ (Press Academy) చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టులకు సమాజం పట్ల సరైన దృక్పథం ఉండాలి. ప్రాంత నైసర్గిక స్వరూపం, సామాజిక అంశాలు, సమస్యలపై అవగాహన పెంపొందించుకోవాలి. అప్పుడే సమాజంలో మంచి జర్నలిస్టుగా రాణిస్తాడని అన్నారు. మీడియా చట్టాలు, నైతిక నియమావళి అనే అంశంపై పలు విషయాలు వివరించారు.
రాజ్యాంగంలో బంధిస్తే పత్రిక స్వేచ్ఛ కోల్పోతుందనే ముందుచూపుతో డాక్టర్ అంబేద్కర్ మీడియాను రాజ్యాంగంలో పొందుపర్చలేదని తెలిపారు. మీడియాకు ఆంక్షలు ఉన్నాయని, అనేక చట్టాలు ఉన్నాయని పేర్కొన్నారు. భారతదేశ ప్రజలకు ఎంత స్వేచ్ఛ ఉందో.. జర్నలిస్టులకు అంత స్వేచ్ఛ ఉందని అన్నారు. భారత రాజ్యాంగం (Indian Constitute)లోని 19 .1aలో పేర్కొన్న భావ ప్రకటన స్వేచ్ఛ పత్రికలను ఏర్పాటు చేసుకుకునే, నిజాలపై నిర్భయంగా రాసే అవకాశం కల్పించిందని వివరించారు. కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ సెక్రటరీ వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్, కార్యదర్శి రాజేశ్, శ్రీనివాస్, సుధాకర్ గౌడ్, లతీఫ్, సాయగౌడ్, పండరీనాథ్, చందు ఉన్నారు.