సిటీబ్యూరో, జూన్ 28 (నమస్తే తెలంగాణ) /సికింద్రాబాద్ : రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ద్రోణి కూడా తోడు కావడంతో గ్రేటర్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం అత్యధికంగా నేరెడ్‌మెట్‌లో 5.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయిందని వాతావారణ శాఖాధికారులు వెల్లడించారు. అల్వాల్‌లో 5.3, ఏఎస్ రావునగర్, కాప్రా 4.5, తిరుమలగిరి 4.0, మౌలాలీ, సఫీల్‌గూడ, చర్లపల్లిలో 4.6, ఆనంద్‌బాగ్‌లో 3.4, మధుసూదన్‌నగర్‌లో 3.0, వెస్ట్ మారెడ్‌పల్లిలో 2.9, మచ్చబొల్లారం, హఫీజ్‌పేట్‌లో 2.7, రంగారెడ్డినగర్‌లో 2.6, గచ్చిబౌలిలో 2.2, బాలానగర్ 2.1, పికెట్, మల్లాపూర్ బయోడైవర్సిటీలో 1.9, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో 1.8, కుత్బుల్లాపూర్ (బీఆర్ అంబేద్కర్ భవన్), బాలానగర్‌లో 1.7, షాపూర్‌నగర్, జీడిమెట్ల, మియాపూర్‌లో 1.6, చందానగర్‌లో 1.4, కేపీహెచ్‌బీ కాలనీ, అడ్డగుట్టలో 1.3, హయాత్‌నగర్, హైదర్‌నగర్, బేగంపేట్‌లో 1.2, మధాపూర్, మైత్రివనం, ఫతేనగర్ 1.1, చిలుకానగర్, మోండామార్కెట్, మూసాపేట్, పాటిగడ్డలో 1 సెంటీమీటర్ చొప్పున వర్షం కురిసినట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. రాగల మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
అత్యవసర బృందాలు.. అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా గ్రేటర్ వ్యాప్తంగా నియమించిన మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు 24 గంటలు పని చేసే విధంగా జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్ పర్యవేక్షించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర బృందాలతో పాటు డీఆర్ఎఫ్, హెల్త్ సిబ్బంది క్షేత్ర స్థాయిలో ఉండాలని సూచించారు. సున్నిత, అతి సున్నిత ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పారు. నగర వ్యాప్తంగా 168 బృందాలు ఏర్పాటు చేశామని, 64 మొబైల్ మాన్సూన్ బృందాలు, 104 మినీ మొబైల్, 160 స్టాటిక్ బృందాలు 363 ప్రమాదకర ప్రాంతాల్లో నాలా భద్రత చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. జోనల్ కమిషనర్లు డిప్యూటీ కమిషనర్ రోడ్లపై నీరు నిల్వ ఉండే ప్రదేశాలు, చెరువులు ప్రమాదకర స్థాయికి చేరకుండా ప్రతిరోజు పర్యవేక్షించాలని మేయర్ పేర్కొన్నారు. వర్షాధారిత సమస్యలపైన ప్రజలు 040- 21111111 సంప్రదించాలన్నారు.