సిటీబ్యూరో, జూన్ 28(నమస్తే తెలంగాణ): మేము వీడియో కాల్ చేయగానే ఎందుకు నగ్నంగా మారుతున్నారు.. ఓఎల్ఎక్స్లో అమ్మకానికి వస్తువును పెడితే.. పూర్తిగా చూడకుండానే కొంటామంటూ ఎలా నమ్ముతారు.. అధిక ధర వస్తుందని ఆశపడి.. అడిగిన వెంటనే ఓటీపీలు చెబుతున్నారు.. క్యూఆర్ కోడ్ పంపించగానే స్కాన్ చేస్తున్నారు.. ఆశతో మీ ఫిర్యాదుదారులే తప్పులు చేస్తున్నారు.. మావాళ్లను పట్టుకునేందుకు ఎందుకు వస్తున్నారు. చల్ వెళ్లండి.. అంటూ సైబర్ నేరగాళ్లు మన పోలీసులను హేళన చేస్తున్న తీరు ఇది.
రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో సైబర్ మోసాలకు పాల్పడుతున్న నేరగాళ్లకు అక్కడి గ్రామస్తులు అండగా ఉంటున్నారు.
స్థానిక పోలీసులు సైతం వారికి కొన్ని సందర్భాల్లో సహకరిస్తున్నారు. దీంతో నేరగాళ్లను పట్టుకునేందుకు వెళ్తున్న మన పోలీసులకు కష్టాలు ఎదురవుతున్నాయి. ఇలాంటి అవమానకర పరిస్థితులను సైతం ఎదుర్కొంటూ సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు నిందితులను పట్టుకుంటున్నారు. కొన్ని సమయాల్లో ప్రాణాలకు సైతం తెగించి సైబర్ మోసగాళ్లను పట్టుకుంటున్నారు. గ్రామస్తులు, అక్కడి ప్రజాప్రతినిధులు నేరగాళ్లకు తోడుగా నిలిచారు. ఇతర రాష్ర్టాల నుంచి వెళ్తున్న పోలీసులు వారి ప్రాంతంలోకి ప్రవేశించేందుకు అక్కడ ఓ టైం ఫిక్స్ చేశారు.
వారి అడ్డాలో సోదాలు చేయాలంటే ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకే అక్కడి గ్రామస్తులు అనుమతి ఇచ్చారు. ఆ సమయంలోనే నిందితుల కోసం పోలీసులు వెళ్లాలి. నేరగాళ్లను పట్టుకునేందుకు వెళ్తున్న ఇతర రాష్ర్టాల పోలీసులు ఇప్పుడు వారి అడ్డాలకు దూరంగా కొన్ని కిలోమీటర్ల దూరంలో నిఘా పెడుతున్నారు. నేరగాళ్లు బయటకు వచ్చిన విషయాన్ని గుర్తించి పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఒక్కోసారి 15 రోజుల నుంచి నెల రోజుల వరకు అక్కడే ఉండాల్సి వస్తుంది.
ఓఎల్ఎక్స్లో మోసం..పట్టుకోవడానికి వెళ్తే..
ఇటీవల సైబరాబాద్ పోలీసులు ఓఎల్ఎక్స్ మోసాలకు పాల్పడ్డ నిందితులను పట్టుకునేందుకు రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు వెళ్లారు. అప్పుడు సమయం సాయంత్రం ఆరు గంటలు. ఈ సమయంలో మా గ్రామంలోకి మీకు ప్రవేశంలేదు.. అని అక్కడి ప్రజలు చెప్పారు. అవాక్కైన పోలీసులు.. స్థానిక పోలీసుల సహాయాన్ని తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే జాతీయ పార్టీకి చెందిన స్థానిక శాసన సభ్యురాలు అక్కడికి చేరుకుంది. మీరు ఎందుకు వచ్చారు. మా వాళ్లు మోసం చేయలేదు. మీ ఫిర్యాదు దారులందరూ తెలివితక్కువ వాళ్లు. వారు ఎందుకు డబ్బులు వేశారు.. అంటూ ఆ శాసన సభ్యురాలు పోలీసులను నిలదీసింది. మీకు ఇప్పుడు అనుమతి లేదు. ఇక్కడ సోదాలు చేయాలంటే ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటలలోపు రావాలి.
అది కూడా అన్ని అనుమతులు, ఆధారాలతో రావాలి. లేదంటే మీ మీద స్థానికుల యాక్షన్ ఉంటుందని శాసన సభ్యురాలు హెచ్చరించింది. మరుసటి రోజు అక్కడి గ్రామస్తులు సూచించిన సమయంలో వెళ్లగా నేరగాళ్లు పరారయ్యారు. అయినా, సైబరాబాద్ పోలీసులు ఆ గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండి కొంతమందిని పట్టుకొచ్చారు. పోలీసులకు చిక్కకుండా సైబర్ నేరగాళ్లు వేస్తున్న ఎత్తులు డేంజర్‌గా మారాయి. అంతేకాదు.. ఎన్నో నేరాలు వెలుగుచూసినా.. ఫిర్యాదు దారుల్లో మార్పురాకపోవడంపై పోలీసులను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తున్నది.