రవీంద్రభారతి, జూన్ 27: తెలుగు నాటక రంగంలో గతంలో నలుగురు పద్మశ్రీ పొందారని, చాలా ఏళ్ళ తరువాత బాబ్జి అనే సురభి నాగేశ్వరావుకు ఆ గౌరవం దక్కిందని తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కేవీ రమణాచారి గుర్తుచేశారు. సురభి కళాకారులు మరో పద్మశ్రీ సాధించి నాగేశ్వరరావుకు అంకితం ఇవ్వటమే ఆయనకు నిజమైన నివాళి అని రమణాచారి అన్నారు. సోమవారం పైడి జయరాజ్ మినీ థియేటర్లో సురభి నాగేశ్వరరావు సంస్మరణ సభ భాషా సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ, సురభి నాటక సమాజాల నిర్వహణలో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ రమణ మాట్లాడుతూ, సురభి నాటక సమాజాలు ఐక్యంగా ఒక కుటుంబంలో ఉండి నాటకం సంప్రదాయాలని కాపాడుకొని నాగేశ్వరరావు స్ఫూర్తి కొనసాగించాలని చెప్పారు.
సంగీత నాటక అకాడమీ కార్యదర్శి జి.వసుంధర మాట్లాడుతూ, సురభి నాటక భీష్ముడు వనారస గోవిందరావు మనవడుగా నాగేశ్వరరావు నాల్గవ ఏటనే రంగస్థలంపై నటించి ఐదు దశాబ్దాలు సురభి నాటక సమాజాలు ఒక్కటిగా కుటుంబ వ్యవస్థకు ప్రతీకగా నాగేశ్వరరావు కృషి చేశారన్నారు. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ సురభి నాగేశ్వరావు లేని లోటు తీర్చిలేనిదన్నారు. అనంతరం వంశీ రామరాజు తమ సంస్థ పక్షాన ప్రతి ఏటా నాగేశ్వరరావు జయంతి సందర్భంగా వారం పాటు నాటకోత్సవం నిర్వహిస్తామని ప్రకటించారు. వేణుగోపాల్ వ్యాఖ్యానంతో పాటు సురభి కళాకారులతో పాటు రంగస్థల ప్రముఖులు వెంకటాచార్యులు, రామ్మోహన్ పాల్గొన్నారు.