ఎల్బీనగర్, జూన్ 27: వరద కాలువ నిర్మాణంతో ధ్వంసమైన కాలనీ డ్రైనేజీ, మంచినీటి పైపులైన్‌ను నూతనంగా వేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. లింగోజిగూడ డివిజన్ మైత్రీనగర్ కాలనీలో సోమవారం ఎమ్మెల్యే పర్యటించారు. కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడంతో పాటు వరదనీటి కాలువ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వరదనీటితో వస్తున్న ఇబ్బందులను తొలిగించేందుకు వరదనీటి కాలువ నిర్మాణ పనులు చేపట్టామన్నారు. ఈ కాలువ తవ్వకాల్లో పగిలిపోయిన డ్రైనేజీ, మంచినీటి పైపులైన్ పనులను వెంటనే ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.
కాలనీ ప్రజలు ఇబ్బంది పడకుండా పైపులైన్ పూర్తయ్యే వరకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ కనకయ్య, జలమండలి అధికారులు బలరాం రాజు, సరిత, విజయ్, లింగోజిగూడ మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాస్‌రావు, నాయకులు వరప్రసాద్, తిలక్‌రావు, శ్రీకాంత్, శ్రీధర్, లక్ష్మారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత
వనస్థలిపురం, జూన్ 27: కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. వనస్థలిపురం డివిజన్ క్రాంతి హిల్స్ కాలనీలో నిర్మిస్తున్న కాలనీ కమ్యూనిటీ హాల్ భవనం పనులను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీవాసులు సొంత నిధులతో భవనం నిర్మించుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్‌రెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు జిట్టా రాజశేఖర్‌రెడ్డి, లగ్గోని శ్రీధర్‌గౌడ్, జైపాల్, కాలనీ గౌరవ అధ్యక్షుడు రామ్‌రెడ్డి, కాలనీ అధ్యక్షుడు యాదిరెడ్డి, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.