బంజారాహిల్స్, జూన్ 24: అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ అరిజన్( ఆపి) వార్షిక సదస్సు అమెరికాలోని శాన్ అంటోనియా నగరంలో ప్రారంభమైంది. సదస్సులో భాగంగా శుక్రవారం తెలంగాణకు చెందిన వైద్యులకు ప్రత్యేక అవార్డులు అందజేశారు. నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు డా.దువ్వూరు ద్వారకానాథ్‌రెడ్డి, జీబీకే మూర్తి, డా. నవ్నిహాల్ సింగ్, డా. మీతాలకు ‘ఆపి’ అవార్డులు అందజేశారు. ప్రజలందరికీ సమానమైన వైద్య అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో గ్లోబల్ హెల్త్ సమిట్‌ను విజయవంతంగా నిర్వహించడంతో పాటు అంతర్జాతీయ సదస్సుల నిర్వహణలో కీలకపాత్ర పోషించినందుకు డా. ద్వారకానాథ్‌రెడ్డికి, హెల్త్‌కేర్ రంగంలో ప్రజలకు వైద్యరంగానికి మధ్య కమ్యూనికేషన్ వారధిగా వ్యవహరిస్తున్న డా.జీబీకే మూర్తి, తన్వీర్ ఫౌండేషన్ ద్వారా వందమంది పేద మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితంగా అందించినందుకు డా. నవ్ నిహాల్ సింగ్‌కు, మోనోపాజ్ సమస్యలపై సేవలు అందిస్తున్నందుకు డా. మీతాకు అవార్డులు అందించినట్లు ఆపి వార్షిక సదస్సు అధ్యక్షురాలు డా. అనుపమ తెలిపారు.