మేడ్చల్, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ)/మేడ్చల్: హైదరాబాద్ మహా నగర పరిధిలో మరో ఐటీ పార్కు ఏర్పాటుకు అంతా సిద్ధమైంది. మేడ్చల్ జిల్లాలో గేట్ వే ఐటీ పార్క్ ఏర్పాటుకు సర్వం సన్నద్ధమైంది. ఈ నెల 17వ తేదీన పురపాలక, ఐటీ శాఖ మంత్రి తారక రామారావు భూమి పూజ చేయనున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. నమస్తే తెలంగాణతో మంత్రి మల్లారెడ్డి శుక్రవారం మాట్లాడుతూ, జిల్లాలోని కండ్లకోయలో 10 ఎకరాల 11 గుంటల భూమిలో గేట్ వే ఐటీ పార్క్‌ను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ చొరవ వల్లే మేడ్చల్ జిల్లాలో ఐటీ పార్క్ ఏర్పాటు సాధ్యమైందన్నారు. నగరం నాలుగు మూలలు అభివృద్ధి చెందేలా మంత్రి కేటీఆర్ ప్రణాళికలను రూపొందిస్తూ అమలు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. మేడ్చల్ జిల్లాలో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఐటీ పార్క్ ఏర్పాటుతో నిజామాబాద్, కరీనంగర్, వరంగల్ జిల్లా యువత, నిరుద్యోగులకు సౌకర్యవంతంగా, ఉపాధి మార్గంగా మారనుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. దీంతో పాటు మేడ్చల్ జిల్లా మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేయనుందన్నారు.
ఐటీ పార్క్ ఏర్పాటుతో 20 వేల ఉద్యోగాలు
మేడ్చల్ జిల్లాలో గేట్ వే ఐటీ పార్క్ ఏర్పాటుతో యువతకు, నిరుద్యోగులకు 20 వేల ఉద్యోగాలు లభించనున్నట్లు మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. ఇప్పటికే కండ్లకోయ గేట్ వే ఐటీ పార్క్‌లో 30 సాఫ్ట్వేర్ కంపెనీలు రిజిస్ట్రేష్టన్లు చేసుకున్నట్లు తెలిపారు. మరిన్ని కంపెనీలు రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ముందుకు వస్తున్నట్లు వివరించారు. కండ్లకోయలో ఐటీ పార్క్ ఏర్పాటు అన్ని ప్రాంతాల వారికి సౌకర్యవంతంగా మారనుంది. ఈ సందర్భంగా మంత్రి కండ్లకోయలో నిర్మించే గేట్ వే ఐటీ పార్క్ నమూన చిత్రాన్ని విడుదల చేశారు. జిల్లాలోని కొంపల్లి, కండ్లకోయ, మేడ్చల్, మునీరాబాద్‌లో ఐటీ పార్క్‌కు స్థలాలను గుర్తించంగా కండ్లకోయలో ఐటీ పార్క్ ఏర్పాటుకు అనువుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
రాష్ర్టాభివృద్ధికి కంకణం.. స్థల పరిశీలన
తెలంగాణ రాష్టాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు కంకణం కట్టుకున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు అహర్నిషలు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఐటీ పార్కు ఏర్పాటులో భాగంగా గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధిలోని కండ్లకోయ శివారులో గల మార్కెట్ యార్డును శుక్రవారం కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సందర్శించారు. రింగురోడ్డు పక్కన గల ఈ ప్రాంతాన్ని సాయంత్రం అధికారులతో కలిసి మార్కెట్ యార్డులో మంత్రి స్థల పరిశీలన చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ ప్రభాకర్, కమిషనర్ లావణ్య, కౌన్సిలర్లు మల్లికార్జున్ ముదిరాజ్, వీణ సురేందర్ గౌడ్, శ్రీలతా శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్ గౌడ్, నరేందర్ రెడ్డి, రాజేందర్, అధికారులు పాల్గొన్నారు.