సిటీబ్యూరో, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రామ్(సీఆర్ఎంపీ) పథకం విజయవంతంగా కొనసాగుతున్నది. రోడ్ల నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించి ఎక్కడా గుంతలు లేకుండా సాఫీ ప్రయాణమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటూ రహదారులను ఎప్పటికప్పుడు మెరుగ్గా ఉంచుతున్నారు. నగరంలోని 9,100 కిలోమీటర్ల రోడ్లలో మూడు లేన్లకు మించి వెడల్పు ఉన్న వాటిని జీహెచ్ఎంసీ ప్రైవేట్ నిర్వహణకు అప్పగించింది. దీనికోసం ఐదేళ్ల పాటు రూ.1,839 కోట్లు ఖర్చు చేస్తున్నది. ఎంత పని జరిగితే అంత వరకే బిల్లులు చెల్లిస్తుండటం వల్ల ముందస్తు అంచనా వేసిన ప్రకారం ప్రాజెక్టు వ్యయం సైతం మిగులు దిశగా సాగుతున్నది.
ఇందులో భాగంగానే ప్రాజెక్టు వ్యయాన్ని పెంచకుండా అదనంగా 102.47 కిలోమీటర్ల రోడ్లను సీఆర్ఎంపీలోకి చేర్చి ప్రజాధనాన్ని సద్వినియోగం చేసినట్లు ఇంజినీరింగ్ విభాగం అధికారులు తెలిపారు. గతంలోని రోడ్లకు కొనసాగింపుగా మరో 102.47 కిలోమీటర్ల రోడ్లను ప్రైవేట్ నిర్వహణలోకి తీసుకువచ్చారు. ఇప్పటి వరకు 642 కిలోమీటర్ల మేర రోడ్ల పునర్నిర్మాణానికి రూ.968 కోట్లు ఖర్చు చేశారు. 2023 నాటికి మొత్తం రీకార్పెటింగ్ పనులు పూర్తి చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తంగా సీఆర్ఎంసీ రోడ్ల పరిధిని వెయ్యి కిలోమీటర్లకు పెంచాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. కాగా గతంలో రోడ్లకు సంబంధించిన పనుల కోసం ఐదేండ్ల పాటు ఒకేసారి టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించేవారు. కానీ సీఆర్ఎంపీతో పదేపదే టెండర్లు పిలవడం తప్పింది. జాప్యం లేకుండా, నిర్లక్ష్యానికి తావులేకుండా రోడ్ల నిర్వహణ సాధ్యమవుతున్నది. రహదారి భద్రతా ప్రమాణాలు మెరుగవుతున్నాయి.