వ్యవసాయ యూనివర్సిటీ , జూన్ 23: యాంత్రీకరణ, అధునాతన టెక్నాలజీతో సాగు చేస్తే ఆకుపచ్చ తెలంగాణ సాధ్యమేనని, రాష్ట్ర ప్రభుత్వం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌నకు అధిక ప్రోత్సాహం ఇస్తున్నదని రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (ఆర్ఐసీహెచ్) డైరెక్టర్ ఆఫ్ జనరల్ అజిత్ రంగ్నేకర్ అన్నారు. గురువారం ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో ఫ్లేమ్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నిర్వహించారు. ది ఎమర్జెన్స్ ఆఫ్ అగ్రిటెక్ ఇన్నోవేషన్ ఇన్ టూ అగ్రిఫుడ్ సిస్టమ్స్ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో ఇన్నోవేషన్‌కు అపార అవకాశాలు ఉన్నాయని సూచించారు.
టెక్నాలజీ నిత్య జీవితంలో విడదీయరాని భాగం అయ్యిందన్నారు. నాబార్డు డిప్యూటీ జనరల్ మేనేజర్ సోమసుందరం మాట్లాడుతూ.. నాబార్డ్ తెలంగాణ సహా దేశవ్యాప్తంగా అగ్రి స్టార్టప్‌లను విస్తృతంగా ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. పీజేటీఎస్ఏయూ ఆధ్వర్యంలో అగ్రిహబ్ ఏర్పాటుకు ఎంతో తోడ్పాటును అందించిందన్నారు. వర్సిటీ ఉప కులపతి డా. ప్రవీణ్ రావు మాట్లాడుతూ.. డిజిటల్ టెక్నాలజీ సాయంతో స్మార్ట్ వ్యవసాయం వైపు సాగాల్సిన అవసరం ఉందన్నారు. అధునాతన టెక్నాలజీతో వ్యవసాయ రంగ సమస్యలను పరిష్కరించుకోవచ్చని సూచించారు. అగ్రిహబ్, పీజేటీఎస్ఏయూ, టీ -హబ్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించిందన్నారు. విద్యార్థులు టార్చ్ రన్ నిర్వహించారు. అగ్రి హబ్ సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ సుధీర్ కుమార్ , డీన్ ఆఫ్ అగ్రికల్చర్ సీమ, అగ్రిహబ్ సీఈవో ఎన్.విజయ్, విశ్వవిద్యాలయ పరిధిలోని 9 కళాశాల విద్యార్థులు , టీ- హబ్, రిసెర్చ్, నాబార్డు నుంచి దాదాపు 1000 మంది విద్యార్థులు, ఫ్యాకల్టీ తదితరులు పాల్గొన్నారు.