చాంద్రాయణగుట్ట, జూన్ 23: ఇద్దరు వ్యక్తుల మధ్య పరిచయం ప్రేమగా మారింది. దీంతో కొన్నాళ్లు సహజీవనం చేశారు. ఇద్దరి మధ్య బంధం స్వలింగ సంపర్కానికి దారి తీసింది. ఇందులో ఓ వ్యక్తికి పెండ్లి కుదిరింది. ఆ సమయంలో మరో వ్యక్తి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాడు. ఆర్థిక సాయం పొందిన యువకుడు డబ్బు కోసం తరుచూ వేధించడం మొదలుపెట్టాడు. తనకు డబ్బు ఇవ్వకుంటే నీతో కలిసి గడిపిన నగ్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ బెదిరించాడు. వేధింపులు భరించలేని మరో వ్యక్తి గుర్తు తెలియని మందులు వేసుకొని ఆత్మహత్యాహత్నం చేశాడు.
శాలిబండ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శాలిబండ ప్రాంతానికి చెందిన వ్యక్తి (40) భార్య ఐదేళ్ల కిందట మరణించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు మరో యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే కొన్ని నెలలకే అతడి ప్రవర్తనపై అనుమానం రావడంతో భార్య అతన్ని వదిలిపెట్టి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటూ ఆన్లైన్లో ట్యూషన్స్ చెప్తున్నాడు సదరు వ్యక్తి. ఈ క్రమంలో మొఘల్‌పురాకు చెందిన ఓ వ్యక్తి (37)తో శాలిబండకు చెందిన వ్యక్తికి కొన్నాళ్ల కిందట పరిచయం ఏర్పడింది.
ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. గత ఫిబ్రవరిలో మొఘల్‌పురాకు చెందిన వ్యక్తికి ఓ యువతితో వివాహం జరిగింది. ఈ పెండ్లి కోసం శాలిబండకు చెందిన వ్యక్తి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేశాడు. అయినప్పటికీ మొఘల్‌పురాకు చెందిన వ్యక్తి తరచూ తనకు మరిన్ని డబ్బులు కావాలంటూ ఒత్తిడి తీసుకు వచ్చాడు. డబ్బులు ఇవ్వకుంటే మన మధ్యలో ఉన్న బంధాన్ని బహిర్గతం చేస్తూ నగ్నంగా ఉన్న చిత్రాలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. గతంలో కూడా ఇద్దరి మధ్య వ్యవహారం ముదరడంతో మొఘల్‌పురా పోలీసులకు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. తాజాగా ఈనెల 20వ తేదీన మరోసారి డబ్బులు కావాలంటూ మొఘల్‌పురాకు చెందిన వ్యక్తి ఒత్తిడి తేవడంతో శాలిబండకు చెందిన వ్యక్తి గుర్తు తెలియని మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు 100 డయల్‌కు, 108కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. అపస్మారకస్థితిలో ఉన్న సదరు వ్యక్తిని వెంటనే చికిత్స నిమిత్తం ఉస్మానియా వైద్యశాలకు తరలించి ప్రాణాలు కాపాడారు.