హయాత్‌నగర్, జూన్ 23 : సొంతూరుకు వెళ్లి వచ్చే సరికి ఓ దొంగ ఇంటికి కన్నపెట్టాడు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం…ఎల్బీనగర్లోని మైత్రినగర్‌లో నివాసం ఉండే అప్పలపురం ప్రసాద్‌రెడ్డి ఈ నెల 2న కుటుంబ సభ్యులతో కలిసి తన స్వగ్రామానికి వెళ్లాడు.
6న ఇంటి పక్క వారు ఫోన్ చేసి మెయిన్ డోర్‌కు తాళం తెరిచి ఉన్నట్లు చెప్పారు. దీంతో ఇంటికి చేరుకున్న ప్రసాద్‌రెడ్డి రూ.15వేల నగదు మాయమైనట్లు గుర్తించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తు చేపట్టారు. రామాంతపూర్ నేతాజీనగర్‌కు చెందిన ఎరుగురాళ్ల వేణుగోపాల్ (41) దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. సదరు నిందితుడు వివిధ పోలీసుస్టేషన్ల పరిధిలో 35 ఇండ్లకు కన్నం వేసినట్లు తేల్చారు. గురువారం అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.