సిటీబ్యూరో, జూన్ 21 (నమస్తే తెలంగాణ): ‘మెట్రోలో రద్దీ పెరిగింది. రద్దీగా ఉన్న రైళ్లలోనే ఒకరిని ఒకరు తోసుకుంటూ ముంబై సబర్బన్ రైళ్లలో మాదరిగా ప్రయాణం చేయాల్సి వస్తోంది’ ఇదీ నగరంలో మెట్రో రైలులో ప్రయాణం చేస్తున్న వారి అభిప్రాయం. ఐటీ ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు వస్తుండడం, విద్యా సంస్థలు పూర్తి స్థాయిలో తెరుచుకోవడంతో నగరంలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా పెరిగింది. ఈ సమయంలో రోడ్డు మార్గంలో వెళితే ట్రాఫిక్ జామ్‌లతో ఆలస్యమవుతుందని, చాలా మంది వాహనదారులు, ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే వారు మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా మెట్రో రైళ్లలో రద్దీ పెరిగింది. మెట్రో కారిడార్-1(ఎల్బీనగర్-మియాపూర్), మెట్రో కారిడార్-3(నాగోల్-రాయిదుర్గం)లో ఎక్కువగా రద్దీ ఉంటోందని ఉప్పల్ నుంచి హైటెక్ సిటీకి వచ్చే పలువురు ఐటీ ఉద్యోగులు తెలిపారు. ప్రస్తుతం ప్రతి రోజు మెట్రోలో 3 లక్షల మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు. ఈ సంఖ్య రోజు రోజుకు మరింత పెరిగే అవకాశం ఉంది.
సర్వీసుల సంఖ్య పెంచాలి..
రద్దీకి అనుగుణంగా మెట్రో సర్వీసులను ఆయా కారిడార్లలో పెంచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. నగర ఐటీ ఉద్యోగులు ట్విట్టర్ వేదికంగా రద్దీ ఉన్న ఫొటోలను పోస్టు చేస్తున్నారు. అమీర్‌పేట నుంచి హైటెక్ సిటీ వెళ్లే మార్గంలో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు రద్దీ ఎక్కువగా ఉంటున్నా, ఆ సమయంలో లూప్ లైన్లో మెట్రో రైళ్లను నడుపుతామని అధికారులు చెప్పినా, ఆవిధంగా నడపడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ట్విట్టర్లో ఎల్ అండ్ టీ మెట్రో అకౌంట్‌కు పలువురు మెట్రో ప్రయాణికులు రద్దీతో కూడిన ఫొటోలను ట్యాగ్ చేస్తున్నారు.