మేడ్చల్ రూరల్, జూన్ 21 : జాతీయ రహదారి విస్తరణ మేడ్చల్లో ఆరులేన్లు, ఒక ఫ్లై ఓవర్గా ఉంటుందని ఆర్డీవో రవి తెలిపారు. మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయంలో రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న వారితో మంగళవారం అధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ మేడ్చల్ మీదుగా వెళ్తున్న 44వ జాతీయ రహదారి విస్తరణ స్వరూపాన్ని వివరించారు. కండ్లకోయ శివారు నుంచి కాళ్లకల్ శివారు వరకు విస్తరణ పనులు జరుగుతాయన్నారు. రోడ్డుకు 15 మీటర్ల దూరం వెడల్పు చేస్తారన్నారు. ప్రస్తుతం 40 మీటర్లలో రోడ్డు ఉందని, మరో 15 మీటర్ల మేర వెడల్పు చేస్తారని తెలిపారు. 15 మీటర్లను ఏడున్నర మీటర్లు మధ్యలో నుంచి తీసుకోరని, ఎక్కడ వెడుల్పు అవసరముంటే అక్కడ సేకరిస్తారన్నారు. మేడ్చల్ చెక్పోస్ట్ నుంచి ఐటీఐ వరకు ఫ్లై ఓవర్ ఏర్పాటు చేస్తారని, రోడ్డు ఆరులేన్లుగా ఉంటుందని తెలిపారు. నిర్వాసితులకు ఇచ్చే నష్టపరిహారాన్ని ఇంకా ఖరారు చేయలేదన్నారు. పరిహారం ఇచ్చిన తర్వాతే పనులు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. అభ్యంతరాలుంటే కలెక్టర్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
నిర్వాసితుల సందేహాలు నివృత్తి..
44వ జాతీయ రహదారి విస్తరణలో మేడ్చల్ ప్రాంతంలో ఆస్తులు కోల్పోతున్న వారితో అధికారులు సమావేశమై, సందేహాలను నివృత్తి చేశారు. ఆర్డీవో రవి ఆధ్వర్యంలో రహదారుల, భవనాలు, రెవెన్యూ, ఎన్హెచ్ఐఏ అధికారులు పాల్గొన్నారు. రోడ్డు విస్తరణ, నష్టపరిహారం వంటి విషయాలను సమావేశంలో అధికారులు వెల్లడించారు. మేడ్చల్ నుంచి కండ్లకోయ వరకు రోడ్డు విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న వారికి వారం రోజుల కింద నోటీసులు ఇచ్చారు. బాధితుల నుంచి ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు సేకరించారు. మేడ్చల్, అత్వెల్లి, ఎల్లంపేట గ్రామాలకు కౌంటర్లు ఏర్పాటు చేసి, దరఖాస్తులు స్వీకరించారు. పలువురు తమకు ఉన్న సందేహాలతో అధికారులతో మాట్లాడి నివృత్తి చేసుకున్నారు. కార్యక్రమంలో తాసీల్దార్ గీత, జాతీయ రహదారుల అధికారులు పాల్గొన్నారు.