అంబర్పేట, జూన్ 20(నమస్తే తెలంగాణ): అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఓ విద్యార్థి జీవితాన్ని ఓ పుస్తకం మార్చేసింది. పదో తరగతిలో ఉన్న సమయంలో రోడ్డు వెంబడి తిన్న ఆహారం అతనికి అనారోగ్యాన్ని తెచ్చిపెట్టింది. ఆ సమయంలో దొరికిన ఓ యోగా పుస్తకం అతని జీవితంలో వెలుగులు నింపింది. ఆ పుస్తకం రాసిన సూర్యరాఘవ దీక్షితుల వద్ద శిక్షణ పొందడంతో… ఆ రోజు నుంచి ప్రతినిత్యం యోగా సాధన ఓ అలావాటుగా మారింది. ఆహారపు అలవాట్లూ మారాయి. దీనికి తోడు ఉన్నతమైన చదువులు అతడిని ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా నిలబెట్టాయి. ప్రస్తుతం విశ్రాంత జీవనం గడుపుతున్న ఆయన యోగా గురువుగా తన సేవలను విస్తరిస్తున్నారు.
అంబర్పేట డీడీ కాలనీలో నివాసముంటున్న డాక్టర్ తాటికొండ వెంకటరాజయ్య ఉస్మానియా యూనివర్శిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పని చేస్తూ ఇటీవలనే రిటైర్డ్ అయ్యారు. యోగాను ప్రజలందరికీ చేరువ చేయాలన్న సంకల్పంతో ఉదయం, సాయంత్రం వేళల్లో యోగా పాఠాలు చెబుతూ యువతలో ఆరోగ్య స్పృహ పెంచుతున్నారు. యోగాలో డిప్లొమో చేసిన డాక్టర్ తాటికొండ వెంకటరాజయ్య పర్ణయోగతో పరిపూర్ణ ఆరోగ్యం పొందారు. యోగకు సంబంధించిన చాలా పుస్తకాలు రాశారు. ఆరోగ్యం కోసం యోగక్రియలు, ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం, యోగాసాధన తక్షణావసరాలని పేర్కొంటూ ఎంతోమందిని యోగావైపు మళ్లించారు.
గత ఏడాది జూన్లో అమెరికా పర్యటన సందర్భంగా చికాగో, న్యూయార్క్, న్యూజెర్సీ, ఫిలడెల్బియా, బెన్సోలియన్ తదితర నగరాలను సందర్శించే అవకాశం ఆయనకు కలిగింది. అంతర్జాతీయ యోగాడే-2 కార్యక్రమాల్లో భాగంగా అమెరికాలో ఉదయం వేళల్లో భారతీయ ఆలయాల్లో శ్రీఅరబిందో సెషన్లు, సాయంత్రం వేళల్లో ‘ఫిట్నెస్ యోగా’ లపై అక్కడి వారికి యోగా సాధన కార్యక్రమాలను నిర్వహించి వారిని ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆంగ్లబోధన, యోగా సాధన, సామాజిక, వ్యక్తిత్వవికాసం అంశాల్లో ఇంగ్లీషు, తెలుగు భాషల్లో పలు పుస్తకాలు రచించారు.
యోగా, ధ్యానం.. జీవితంలో భాగం
యువతీయువకుల జీవితంలో యోగా, ధ్యానం చేర్చటం ద్వారా గొప్ప విజయాలు సాధించవచ్చనేది నా అనుభవం. అందుకే రాష్ట్రంలో ఏ విద్యాసంస్థ నుంచి కబురొచ్చినా వెళతాను. ‘ధ్యానం సమీపం…నేరం దూరం’ అనేది నా నినాదం. నేటి యువతలో పెరుగుతున్న నేర ప్రవృత్తికి ధ్యానం సరైన పరిష్కారం. మనసే మార్గం…కిచనే క్లినిక్ అని బోధిస్తున్నా. వాటినే విద్యార్థులతో ఆచరించేలా చేయాలన్నది నా యత్నం. శోధన, బోధన, సాధన, ఆచరణ, ఆనందం…ఇవే నా సూత్రాలు.
– ప్రొ. తాటికొండ వెంకటరాజయ్య, యోగా మాస్టర్