బంజారాహిల్స్,జూన్ 20: అర్హులైన వారందరికీ దళితబంధు అందించడమే సర్కార్ లక్ష్యమని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. రెండో విడత దళితబంధు పథకం కింద వెంకటేశ్వరకాలనీ డివిజన్‌కు చెందిన దరఖాస్తులను కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి సోమవారం ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు అందజేశారు. వారిలో అర్హులకు కచ్చితంగా దళితబంధు మంజూరయ్యేలా చూస్తామని ఎమ్మెల్యే దానం నాగేందర్ వారికి హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో దళితుల జీవితాల్లో వెలుగులు నింపడంతో పాటు వారు ఆత్మగౌరవంతో వ్యాపారాలు, స్వయం ఉపాధి పొందేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రారంభించారన్నారు. తొలి విడతలో ఒక్కో నియోజకవర్గంలో 100 మందిని ఎంపిక చేశామన్నారు. రెండోవిడతలో నియోజకవర్గానికి 1000మందిని ఎంపిక చేయాలని నిర్ణయించామన్నారు. దళితబంధుతో ఆయా కుటుంబాలు స్వయం సమృద్ధ్ది సాధించడం ఖాయమన్నారు. దళితబంధు కోసం దళారులను ఆశ్రయించవద్దని సూచించారు. తొలివిడతలో దళితబంధు మంజూరు కానివారు మరోసారి దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరకాలనీ డివిజన్ టీఆర్ఎస్ నాయకులు శౌరిరాజు, ప్రేమ్. షాహీన్, అశ్వక్ తదితరులు పాల్గొన్నారు.