సిటీబ్యూరో, జనవరి 31 (నమస్తే తెలంగాణ): ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర వార్షిక బడ్జెట్-2022ను మరికొద్ది సేపట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11గంటలకు ప్రవేశపెట్టే బడ్జెట్లో వాస్తవ రూపం దాల్చేలా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయా? నగర మౌలిక వసతులకు నిధులు కేటాయిస్తారా? లేదా అన్నది నగరవాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నగరానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టుల కోసం మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. గ్రేటర్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అమలు చేస్తున్న వివిధ ప్రాజెక్టుల కోసం కేంద్ర బడ్జెట్లో రూ.7595 కోట్లు కేటాయించాలని కోరారు. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీకి ఎన్ని కేటాయిస్తారు..? అన్నది వేచి చూడాల్సిందేనని అధికారులు చెబుతున్నారు.
పన్ను రేట్లపై ఊరట ఉండేనా?
ఆదాయపు పన్ను మినహాయింపులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇన్‌కం ట్యాక్స్ రేట్స్ శ్లాబ్‌లను తగ్గించాలని పన్ను చెల్లింపుదారులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచేలా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. అదేవిధంగా సీనియర్ సిటిజన్ ఆదాయ పన్ను పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తంగా పన్ను రేట్ల ఊరటపై పట్టణ వాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.