సిటీబ్యూరో, జూన్ 19(నమస్తే తెలంగాణ): బీపీఎల్ (దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న) కుటుంబాలకు చెందిన దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్‌కు చేయూతనిచ్చేందుకు బల్దియా ముందుకు వచ్చింది. వారికి అవసరమయ్యే పరికరాలు, ఉపకరణాలు కృత్రిమ అవయవాలను అందించేందుకు జీహెచ్ఎంసీ కార్యాచరణ చేపట్టింది. అందులో భాగంగా వారిని ఎంపిక చేసి ఉచితంగా ఉపకరణాలను అందించేందుకు జీహెచ్ఎంసీ అలీమ్ కో సమన్వయంతో క్యాంపులను నిర్వహిస్తున్నది. నేటి నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు నిర్వహించే ఈ గుర్తింపు(అసెస్మెంట్) క్యాంపులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు ఆదివారం కోరారు. ప్రతి రోజు రెండు సర్కిళ్లలో క్యాంపులు నిర్వహిస్తామని, ప్రతి క్యాంపులో 250 మంది నుంచి 300 మంది వరకు పరిశీలన కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
ఉచితంగా పంపిణీ చేసే కృత్రిమ అవయవాలు, పరికరాలు, ఉపకరణాలు బ్రెయిలీ కిట్, ఏంఏస్ఐఇడి కిట్/ఎంఆర్ కిట్, క్రచ్ ఎల్బో పరికరం, సంక కర్ర, బ్రెయిలీ డీలక్స్, రోలో టేర్స్, స్మార్ట్ కెన్, డైసీ ప్లేయర్, ఏడియల్ కిట్ (లెప్రసి), సర్వైకల్ కాలర్స్, వీల్ చైర్స్, ఎల్ఏస్ బెల్ట్, ట్రై సైకిల్, సీపీ చైర్, ఇయారింగ్ ఎయిడ్, క్యాలిపర్స్, కృత్రిమ అవయవాలు, అవసరమైన వివిధ పరికరాలు, క్యాంపులో గుర్తించిన వారికి ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకు అవసరమైన డాక్యుమెంట్లు, సదరన్ సర్టిఫికెట్ లేని పక్షంలో దరఖాస్తు చేసుకున్న రశీదు అందజేయాలని సూచించారు.
ఆదాయం సర్టిఫికెట్ కాని, ఫుడ్ సెక్యూరిటీ కార్డులు, అంగ వైకల్యానికి సంబంధించిన పాస్ పోర్టు సైజ్ గల రెండు ఫొటోలు, ఆధార్ కార్డు, సీనియర్ సిటిజన్లకు అవసరమైన డాక్యుమెంట్లు, పుట్టిన తేదీతో ఉన్న ఆధార్ కార్డు, సీనియర్ సిటిజన్ గుర్తింపు(ఐడీ) కార్డు తప్పనిసరి అని పేర్కొన్నారు. నాన్ లోకల్ వారికి ఈ క్యాంపులు వర్తించవని అధికారులు స్పష్టం చేశారు. క్యాంపులలో పూర్తయిన తర్వాత అర్హులకు పరికరాలు, ఉపకరణాలు, కృత్రిమ అవయవాలు పంపిణీ చేస్తారని అధికారులు వెల్లడించారు.