
బోడుప్పల్, జనవరి 31: బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లు సమగ్రాభివృద్ధి సాధిస్తున్నాయని మేయర్ సామల బుచ్చిరెడ్డి అన్నారు. సోమవారం నగర పరిధిలోని 21వ డివిజన్ సాయిభవానీనగర్ కాలనీలో రూ.30లక్షలతో నిర్మించనున్న భూగర్భ డ్రైనేజీ పనులు, ఈస్ట్ బాలాజీహిల్స్ కాలనీలో రూ.5 లక్షల నిధులతో నిర్మించనున్న డ్రైనేజీ పనులకు కార్పొరేటర్ భూక్యా సుమన్ నాయక్‌తో కలిసి మేయర్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ లక్ష్మీరవిగౌడ్, డీఈ కురుమయ్య, స్థానిక కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
మంత్రి మల్లారెడ్డికి ఆహ్వానం
బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో మరో రెండు రోజుల్లో మంత్రి కేటీఆర్ పర్యటించనున్న నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డిని మేయర్ సామల బుచ్చిరెడ్డి, స్థానిక నేతలు అతని నివాసంలో కలిసి ఆహ్వానించారు. మంత్రి కేటీఆర్ పర్యటన, శంకుస్థాపన పనులపై మంత్రి మల్లారెడ్డితో సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ భద్రారెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్, కార్పొరేటర్లు చందర్‌గౌడ్, వెంకటేశ్‌గౌడ్, సుమన్‌నాయక్, టీఆర్ఎస్ నాయకులు రవిగౌడ్, చక్రపాణిగౌడ్, రామచంద్రారెడ్డి, వెంకటేశ్‌యాదవ్, రాములు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పైలాన్ పనుల పరిశీలన
బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధి చెంగిచర్ల చింతల చెరువు వద్ద ఈ నెల 2న రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి తారకరామారావు చేతులమీదుగా ఆవిష్కరించనున్న పైలాన్ పనులను సోమవారం మేయర్ సామల బుచ్చిరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పరిశీలించారు. మంత్రి కేటీఆర్ పర్యటించనున్న ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. రూ.110 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్‌తో నాలా పనులు, ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం లభించనున్నట్లు మేయర్ వెల్లడించారు.